అక్కడ ఓటు వేయకపోతే జైలు లేదా జరిమానా.. మరి ఇక్కడ..?
ABN , First Publish Date - 2020-12-01T23:06:41+05:30 IST
ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం.. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం. దేశ పరిపాల సుస్థిరంగా కొనసాగేందుకు ప్రజలకున్న ఏకైక ఆయుధం. అయితే మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ...
ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం.. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం. దేశం అభివృద్ధి మార్గంలో పయనించాలన్నా.. పరిపాలన సుస్థిరంగా కొనసాగాలన్నా ప్రజలు ఓటును వినియోగించడం తప్పనిసరి. ఈ ఓటు పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ ప్రజలకు ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగం ప్రకారం 18ఏళ్లు దాటిన దేశ పౌరులందరికీ ఈ హక్కు లభిస్తుంది. కానీ దీనిని ఉపయోగించుకునే వారి సంఖ్య మాత్రం ఆశాజనకంగా లేదు. ఓటుహక్కు గంటలకు గంటలు ఉపన్యాసాలిచ్చేవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అలసత్వం ప్రకటిస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడం దేశానికి ద్రోహం చేస్తున్నట్లేననేది కొందరి వాదన. తమ వాదనకు కొన్ని పాశ్చాత్య దేశాలను ఉదాహరణగా వారు చూపుతారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల్లో నిర్బంధ ఓటు హక్కు ఉంది. అంటే ఆయా దేశాల్లో ఎన్నికల సమయంలో ప్రజలంతా కచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలా కాకుండా ఎవరైనా ఓటు వేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానాలు వేస్తారు. జైల్లో కూడా పెడతారు.
బ్రెజిల్, గ్రీస్, ఈజిప్టు, అర్జెంటీనా, బెల్జియం, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఈక్వెడార్, ఇటలీ, పరాగ్వే, స్విట్జర్‌ల్యాండ్, టర్కీ వంటి దేశాలతో పాటు భారత్ పక్కనే ఉన్న థ్యాయ్ ల్యాండ్, సింగపూర్‌లలో కూడా నిర్బంధ ఓటు హక్కు ఉంది. ఈ దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోనివారికి రకరకాల శిక్షలు విధిస్తుంటారు. బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, సింగపూర్, బెల్జియం, ఆస్ట్రియా దేశాల్లో ఓటు వేయని ప్రజలకు పెనాల్టీ విధిస్తారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 గడిచినా ఇప్పటివరకు ఏనాడూ 100 శాతం ఓటింగ్ నమోదు కాలేదు. దీనిని బట్టే ప్రజలు తమ ఓటుకు ఎంత విలువనిస్తున్నారో అర్థమవుతోంది. మరి ప్రజల్లో ఈ అలసత్వాన్ని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? ఎటువంటి చట్టాలను అమలు చేయాలి..? ఒకవేళ నిర్బంధ ఓటు హక్కు చట్టాన్ని తీసుకొస్తే ప్రజలు ఆదరిస్తారా..? వంటి అనేక ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ్ అడ్వానీ అనేకసార్లు స్పందించారు. ‘ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలి. అంతేకాదు ఓటు వేయనివారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే ఓటుకు సరైన సార్థకత లభిస్తుంది. అదే ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం’ అంటూ చెప్పేవారు.
గ్రీస్, ఈజిప్టుల్లో ఏకంగా జైలు శిక్ష విధిస్తారు. థాయ్ ల్యాండ్‌లో ఓటు హక్కు రద్దు చేస్తారు. ఇటలీలో ఓటు వేయలేదని అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రకటిస్తారు. బెల్జియంలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేస్తారు. బోలీవియాలో జీతం ఇవ్వరు. ఈ విధంగా పలు దేశాల్లో వివిధ రకాల శిక్షలు ఉన్నాయి. కానీ 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో మాత్రం ఓటు హక్కు సంపూర్ణ వినియోగం ఏనాడూ జరగలేదు.