దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ముప్పు: నేషనల్ టాస్క్‌ఫోర్స్
ABN , First Publish Date - 2020-06-01T16:33:28+05:30 IST
దేశంలో ఈ రోజు నుంచి ఐదవ దశ లాక్‌డౌన్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఈ రోజు నుంచి ఐదవ దశ లాక్‌డౌన్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కరోనా వ్యాప్తిని నివారించడానికి ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ నిపుణులు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను నియంత్రించడం సాధ్యమేనని నమ్మడం తప్పవుతుందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ విషయంలో ప్రభుత్వ వైఖరిని జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు తప్పుబట్టారు. భారతదేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన ఆధారాలను ఇంతకుముందే కనుగొన్నారు. ఏప్రిల్‌లో భారత వైద్య పరిశోధన సంస్థ ఐసిఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే దీనిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కరోనా మహమ్మారిని పర్యవేక్షించడానికి ఏప్రిల్‌లో జాతీయ టాస్క్‌ఫోర్స్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్రం అనుసరిస్తున్న పద్ధతులను విమర్శిస్తూ మూడు ప్రసిద్ధ వైద్య సంస్థలు మే 25 న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఇలా లేఖ రాసిన వారిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారులు, ఎయిమ్స్ మాజీ, ప్రస్తుత ప్రొఫెసర్లు, బిహెచ్‌యు, జెఎన్‌యు వైద్య నిపుణులు ఉన్నారు. నగరాల నుండి వెళ్లిన కార్మికులు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు వ్యాధిని తీసుకువెళుతున్నారని, ఇది మరింత ముప్పుగా పరిణమిస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు.