బెంగళూరు ప్రజలకు సీఎం యడియూరప్ప సీరియస్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-06-25T23:10:41+05:30 IST

కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరు ప్రజలకు

బెంగళూరు ప్రజలకు సీఎం యడియూరప్ప సీరియస్ వార్నింగ్

బెంగళూరు : కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరు ప్రజలకు గురువారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్‌ను నియంత్రించే చర్యలను అందరూ పాటించాలని, లేదంటే మాత్రం బెంగళూరులో మరో లాక్‌డౌన్ తప్పదని ఆయన సీరియస్‌గా హెచ్చరించారు. ప్రజలందరూ మరో లాక్‌డౌన్ ఉండకూడదన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం... కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని సున్నితంగా హెచ్చరించారు.


బెంగళూరులో నానాటికీ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అన్న అంశంపై రెండు రోజుల పాటు సీఎం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.


‘‘కోవిడ్ రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. దానిని నియంత్రించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాలను పూర్తిగా మూసేసాం కూడా. కోవిడ్ నియంత్రణకు రెండ్రోజుల పాటు మంత్రులు, అధికారులతో చర్చోపచర్చలు జరుపుతున్నాం’’ అని సీఎం యడియూరప్ప ప్రకటించారు.


మరిన్ని కఠినమైన నిబంధనలను అమలు చేసే విషయంపై శుక్రవారం మంత్రులు, అన్ని పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు యడియూరప్ప వెల్లడించారు. అయితే బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధించే విషయంలో మాత్రం నిపుణులతో చర్చించిన తర్వాతే ఓ కచ్చితమైన నిర్ణయానికి వస్తామని ఓ మంత్రి ప్రకటించారు. 

Updated Date - 2020-06-25T23:10:41+05:30 IST