లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఎల్లుండి తేల్చేయనున్న సీఎం!

ABN , First Publish Date - 2020-05-11T17:08:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞలను కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకుగాను

లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఎల్లుండి తేల్చేయనున్న సీఎం!

చెన్నై : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞలను కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం మూడో విడత లాక్‌డౌన్‌ రెండోవారం నిషేధాజ్ఙలు కొనసాగుతున్నాయి. ఈ లాక్‌డౌన్‌ 17న ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను కొనసాగించాలా..? లేదా..? అనే విషయమై కలెక్టర్లు, కరోనాకు చికిత్సలందించే వైద్యనిపుణుల కమిటీ సభ్యుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఎడప్పాడి అడిగి తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13న సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఎడప్పాడి సమగ్రంగా సమీక్ష జరుపనున్నారు. 


లాక్‌డౌన్‌ విధింపు వల్ల క్షీణించిన ఆర్థిక పరిస్థితులను, ప్రజలు కోల్పోతున్న జీవనాధారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పలు రకాల సడలింపులను కూడా ప్రకటించింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 రకాల దుకాణాలను తెరిచేందుకు కూడా అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని ప్రజలంతా మూడు విడతలుగా అమలు చేసిన లాక్‌డౌన్‌ నుంచి ఎప్పుడు బయటపడదామా అనే ఆలోచనలోనే ఉన్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులు నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే 13న జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. ఆ సమావేశం తర్వాత ఆయన వైద్యనిపుణుల కమిటీ సభ్యులతోనూ, కరోనా నిరోధక ప్రత్యేక అధికారి రాధాకృష్ణన్‌తోను సమగ్రంగా సమీక్షించనున్నారు.


కేబినెట్‌ సెక్రటరీతో సీఎస్‌ చర్చలు

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం కేంద్ర మంత్రిత్వ కార్యదర్శితో ఆదివారం చర్చలు జరిపారు. రాష్ట్రంలో మూడో విడత లాక్‌డౌన్‌ మరో వారం రోజులపాటు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలించాలా లేక పాక్షికంగా సడలించాలా అనే విషయమై ఇరువురూ సమగ్రంగా చర్చలు జరిపారు. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతున్న విషయాన్ని ప్రభుత్వ కార్యదర్శి షణ్ముగం కేంద్రమంత్రివర్గ కార్యదర్శికి వివరించారు. 


రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6535కు చేరిందని, అయితే ఇప్పటిదాకా ఆ వైరస్‌ బారిన పడి 44 మంది మాత్రమే మృతి చెందారని, 1824 మంది ఆ వైరస్‌ గండం నుంచి గట్టెక్కి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని షణ్ముగం వివరించారు. అదే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వపరంగా చేపడతున్న చర్యలు గురించి కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చలలో హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్‌, డీజీపీ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T17:08:36+05:30 IST