సీఎంతో విజయ్ రహస్య భేటీ
ABN , First Publish Date - 2020-12-29T13:45:11+05:30 IST
రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నటుడు విజయ్ హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ కావడం అటు రాజకీయ వర్గాల్లో
చెన్నై : రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నటుడు విజయ్ హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ కావడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు కోలీవుడ్ లో విస్త్రతంగా చర్చకు దారి తీసింది. రాజకీయప్రవేశం కోసమే ఆయన సీఎంతో చర్చించేందుకు వెళ్లారని విజయ్ వైరివర్గాలు చెబుతుండగా, త్వరలో విడుదల కానున్న ఆయన సినిమా వ్యవహారంపై మాట్లాడేందుకు సీఎంను కలుసుకున్నారని కోలీవుడ్‌వర్గా లు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తమ్మీద ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా జరిగిన ఈ భేటీ మరోమారు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘బిగిల్’ చిత్రం తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం‘మాస్టర్’ దీపావళికి విడుదలవుతుందని అభిమాను లు ఎదురుచూశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎనిమిది నెలలుగా థియేటర్లు మూతపడడంతో చిత్రం విడుదలలో జాప్యం జరిగింది.
ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే నెల 13వ తేదీ ‘మాస్టర్’ చిత్రం తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదల కానుంది.అయితే థియేటర్లలో కేవలం 50శాతం మంది ప్రేక్షకులను మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలైతే థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవ కాశముంది. అందువల్ల వందశాతం సీట్లకు అనుమతించాలని ఆ చిత్ర నిర్వాహకులు ప్రభుత్వానికి ఇటీవల విన్నవించారు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నటుడు విజయ్ జోక్యం చేసుకున్నారు. ఆదివారం రాత్రి నేరుగా స్థానిక అడయార్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కూడా పాల్గొన్నట్టు సమాచారం. విజయ్ వినతి పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఇప్పటి వరకూ బోసిపోయి కనిపిస్తున్న సినిమా థియేటర్లు త్వరలోనే కళకళలాడడం ఖాయం. అయితే కరోనా నిబంధనలు ఏమేరకు అమలవుతాయన్నది వేచి చూడాల్సిందే.