‘సానుభూతి’పై చిరాగ్‌ ఆశలు!

ABN , First Publish Date - 2020-10-12T07:56:19+05:30 IST

మరో మూడు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎల్‌జేపీ అధినేత, దళిత దిగ్గజం రామ్‌విలాస్‌ పాస్వాన్‌ ఆకస్మిక మృతి- బిహార్‌ రణాంగాన్ని రసకందాయలో పడేసింది...

‘సానుభూతి’పై చిరాగ్‌ ఆశలు!

  • మహా దళిత వర్గాల ఓట్లపై నితీశ్‌ ఫోకస్
  • వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ
  • బిహార్‌ రణాంగంలో పాస్వాన్‌ ఎఫెక్ట్‌

పట్నా, అక్టోబరు 11: మరో మూడు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎల్‌జేపీ అధినేత, దళిత దిగ్గజం రామ్‌విలాస్‌  పాస్వాన్‌ ఆకస్మిక మృతి- బిహార్‌ రణాంగాన్ని రసకందాయలో పడేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాస్వాన్‌కున్న పేరు ప్రతిష్టలు, ముఖ్యంగా దళిత, నిమ్న వర్గాల్లో ఆయన పట్ల ఉన్న విశేషమైన ఆదరాభిమానాలు ఇపుడు ఎంతమేర ఆయన పార్టీ ఎల్‌జేపీకి ట్రాన్స్‌లేట్‌ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా పాస్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాస్వాన్‌ పార్టీ వ్యవహారాలను సొంతంగా నడిపిస్తున్నప్పటికీ తండ్రి సూచనల మేరకే ఆయన వెళుతున్నారు. ఇపుడు చిరాగ్‌కు ఆ మార్గదర్శకత్వం లేదు. అయితే ఇప్పటికే ఎల్‌జేపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చి సొంతంగా పోటీ చేయాలని నిశ్చయించుకుంది.


రాష్ట్రవ్యాప్తంగా చిరాగ్‌ పేరు దళిత, ఇతర సామాజిక వర్గాల్లో చిరపరిచితమే. రెండుసార్లు జముయ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 37-ఏళ్ల చిరాగ్‌ బిహార్‌ అంతటా దళిత వర్గాలకు కొంతమేర చేరువయ్యారు. అయితే రాంవిలాస్‌ పాస్వాన్‌కు గ్రామస్థాయి నుంచి సంబంధాలుండేవి. ఆయన నేరుగా దళితవాడలకు, ఓబీసీ వర్గాల వద్దకు వెళ్లి, కూర్చుని, భోజనాలు చేసి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. చిరాగ్‌ కాస్త ఆధునికత సంతరించుకున్న వ్యక్తి.. తండ్రికున్నంత లోతైన సంబంధాల్లేవు. అయిన్పటికీ రాంవిలాస్‌ పాస్వాన్‌ మరణంతో వీచే సానుభూతి పవనాలు చిరాగ్‌కు కొంతవరకూ లాభిస్తాయన్న అంచనాలున్నాయి. చిరాగ్‌ కూడా ఎన్నికల్లో విరివిగా తండ్రి ఫోటోను, సేవలను వాడుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తమ కోర్‌ ఓటుబ్యాంకును నిలబెట్టుకోవాలన్న ఆశతో ఉన్నారు.  ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను మాత్రమే టార్గెట్‌ చేసుకుని, జేడీయూ ఓట్లను చీల్చే ఏకైక లక్ష్యంతో చిరాగ్‌ ముందుకెళుతున్నారు.  నితీశ్‌ పెద్ద అవినీతిపరుడని, ఐదేళ్లలో బిహార్‌కు ఊడబొడిచిందేమీ లేదని అంటూ ఆయనపై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు.


ఎన్‌డీఏలో మరో ప్రధాన భాగస్వామ్యపక్షం బీజేపీతో మాత్రం చిరాగ్‌ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ మోదీ-అనుకూల, నితీశ్‌-వ్యతిరేక వ్యూహం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి. ఎన్నికల అనంతరం - ప్రభుత్వ ఏర్పాటుకోసం బీజేపీతో జట్టు కడతామని ఇప్పటికే చిరాగ్‌ ప్రకటించేశారు. బీజేపీ పోటీచేస్తున్న 121 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో చిరాగ్‌ తన అభ్యర్థులను నిలపలేదు. కేవలం జేడీయూ పోటీచేస్తున్న 122 స్థానాల్లోనే గట్టి పోటీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది జేడీయూలో  కొంత గుబులు పుట్టిస్తున్నా నితీశ్‌ మాత్రం చిరాగ్‌ అంటే బెదిరిపోవడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. 2005 నుంచి నితీశ్‌ వ్యూహం ఒక్కటే... పాస్వాన్‌ దళిత ఓట్ల మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ ‘మహా దళితుల’ (అంటే దళితుల్లో అత్యంత వెనుకబడ్డ కులాల) ఓట్లు తనకే పడుతున్నాయని నితీశ్‌ భావిస్తున్నారు. 


బిహార్‌ ఓటర్లలో దళితుల ఓట్లు 15ు. రాష్ట్రంలో  మొత్తం 22 దళిత కులాలున్నాయి. వీటిలో నాలుగు కులాలు- పాస్వాన్‌, పాసి, ధోబీ, చమార్‌- ఆర్థికంగా సంపన్నమైనవి.... వీటి జనాభా 69 శాతం. మిగిలిన 18 కులాలు- బంతర్‌, భౌరీ, బొగటా, భుయాన్‌, చౌపాల్‌, దోమ్‌, ఘసీ, హలాల్కర్‌, హాడీ... మొదలైనవి ఆర్థికంగా బాగా వెనకబడ్డవి. ఇవే మహాదళిత కులాలు. ఇవి 31 శాతం. ఈ మహాదళితుల అభ్యున్నతి కోసం నిరుడు నితీశ్‌ వందల కోట్ల మేర సంక్షేమ ప్యాకేజీలు ప్రకటించారు. ఈ కులాల ఓట్లతో పాటు సంపన్న దళిత కులాల వారి ఓట్లు కూడా తనకు గణనీయంగానే పడతాయని, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇది రుజువైందని నితీశ్‌ అంటున్నారు. ఈసారి మహాదళిత వర్గాలకు చెందిన, మాజీ సీఎం జితిన్‌రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ ఆవామీ మోర్చాతో నితీశ్‌ పొత్తు పెట్టుకున్నదీ తన ఓటుబ్యాంకు చెదిరిపోరాదన్న ఉద్దేశంతోనే..! అటు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.


జేడీయూతో పొత్తు చెడరాదన్న లక్ష్యంతో నితీశే ఎన్‌డీఏ నేత అని బయటకు ప్రకటించినప్పటికీ చిరాగ్‌ను దూరం చేసుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. ఏ కారణం చేతైనా జేడీయూకు సీట్లు తగ్గితే- ఎల్‌జేపీ సా యంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేయడానికి బీజేపీ సంకోచించదని అంటున్నారు. అదీకాక-దళితులకు సంబంధించిన అనేక అంశాలపై మోదీ చాలామార్లు పాస్వాన్‌ సేవలను వాడుకున్నారు. అదే పం థాను చిరాగ్‌ విషయంలోనూ అనుసరిస్తారని అంటున్నారు. తండ్రి మరణంతో ఖాళీ అయిన కేంద్ర మంత్రివర్గ స్థానాన్ని తనకు కేటాయించాలని చిరాగ్‌ భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంకా దీనిపై ఓ అభిప్రాయానికి రాలేదు. చిరాగ్‌ సత్తా ఎంత అన్నది బిహార్‌ ఫలితా ల్లో చూశాక- నిర్ణయం తీసుకుందామన్నది మోదీ-షాల ఆలోచనగా చెబుతున్నారు. Updated Date - 2020-10-12T07:56:19+05:30 IST