‘పోస్టర్’ తో క్లారిటీ ఇచ్చేసిన చిరాగ్ పాశ్వాన్

ABN , First Publish Date - 2020-10-03T20:58:40+05:30 IST

ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన బిహార్‌లోని

‘పోస్టర్’ తో క్లారిటీ ఇచ్చేసిన చిరాగ్ పాశ్వాన్

పాట్నా : ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వానికి కాస్తంత టెన్షన్ పెట్టారు. నితీశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో చిరాగ్ విరుచుకుపడ్డారు. సీఎంగా నితీశ్ అనర్హుడంటూ కూడా విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీకి టెన్షన్ మొదలైంది. చిరాగ్‌ను బుజ్జగించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ చిరాగ్ వెనక్కి తగ్గలేదు. ఈ వ్యవహారం బీజేపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయితే చిరాగ్ పాశ్వాన్ ఓ పోస్టర్‌తో బీజేపీ టెన్షన్‌ను దూరం చేసి, పొత్తుపై ఓ క్లారిటీ ఇచ్చారు. బిహార్ మొత్తం ప్రస్తుతం దీనిపైనే చర్చిస్తున్నారు.


ఈ పోస్టర్ లో ఏముందంటే....

‘‘మాకు నితీశ్‌పైనే తీవ్ర అసంతృప్తి ఉంది. బీజేపీపై అసంతృప్తేమీ లేదు. ‘‘మోదీతో మాకు ఇబ్బందే లేదు. నితీశ్‌తోనే ఇబ్బంది. నితీశ్‌కు ముఖ్యమంత్రి కుర్చీయే మొట్ట మొదటి ప్రాధాన్యం. మాకు, బీజేపీకి మాత్రం రాష్ట్రమే మొదటి ప్రాధాన్యం.’’ అంటూ చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 



ఒంటరిగానే గోదాలోకి దిగుతుందంటూ ప్రచారం

సీట్ల పంపిణీ విషయంలోనే నితీశ్‌, చిరాగ్ పాశ్వాన్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. తాము ఎవరికీ మద్దతివ్వమని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని చిరాగ్ ప్రకటించారు కూడా. ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఇకపై పార్టీ వ్యవహారాలన్నీ చిరాగే చూసుకుంటారని స్వయంగా రాంవిలాస్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోందని సీనియర్లు పేర్కొంటున్నారు. మరోవైపు శనివారం సాయంత్రం చిరాగ్ నేతృత్వంలో పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా సీట్లు, పొత్తులపైనే చర్చించి... తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2020-10-03T20:58:40+05:30 IST