లద్దాఖ్‌లో మళ్లీ చైనా దుస్సాహసం

ABN , First Publish Date - 2020-09-01T08:05:54+05:30 IST

తూర్పు లద్దాఖ్‌లో చైనా మళ్లీ దుస్సాహసానికి ఒడిగట్టింది. శనివారం రాత్రి - ఆదివారం తెల్లవారుజాము మధ్యలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసింది. జూన్‌ 15న గల్వాన్‌ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణ తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి యథాతథస్థితిని కొనసాగించాలంటూ కమాండర్‌ స్థాయి చర్చల సందర్భంగా జరుపుకొన్న ఒప్పందాలను ఉల్లంఘించింది...

లద్దాఖ్‌లో మళ్లీ చైనా దుస్సాహసం

  • పాంగాంగ్‌ సరస్సు వద్ద ఆక్రమణకు కుతంత్రం
  • సరస్సు దక్షిణ భాగంలో భారీగా పీఎల్‌ఏ
  • భారత్‌ అప్రమత్తం.. దీటుగా తిప్పికొట్టిన సైన్యం
  • ఎలాంటి ఘర్షణ జరగలేదని కేంద్రం వెల్లడి
  • తాజా ఘటనపై ప్రధాని మోదీ వరుస సమీక్షలు
  • భారతే మా భూభాగాన్ని ఆక్రమించింది: చైనా
  • మానస సరోవరం వద్ద క్షిపణి క్షేత్రం
  • టార్గెట్‌గా ఉత్తరాదిలోని ప్రధాన నగరాలు?
  • 1962 పరిస్థితులే పునరావృతం?


న్యూఢిల్లీ, లద్దాఖ్‌, ఆగస్టు 31: తూర్పు లద్దాఖ్‌లో చైనా మళ్లీ దుస్సాహసానికి ఒడిగట్టింది. శనివారం రాత్రి - ఆదివారం తెల్లవారుజాము మధ్యలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసింది. జూన్‌ 15న గల్వాన్‌ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణ తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి యథాతథస్థితిని కొనసాగించాలంటూ కమాండర్‌ స్థాయి చర్చల సందర్భంగా జరుపుకొన్న ఒప్పందాలను ఉల్లంఘించింది. ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించింది. నిర్మాణ సామగ్రితో పెద్ద సంఖ్యలో అక్కడికి సైన్యాన్ని పంపింది. ఇప్పటి వరకు ఉత్తర తీరంలోని భూభాగంపై కన్నేసిన చైనా దక్షిణం వైపు రావడం ఇదే తొలిసారి. చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత సైన్యం పీఎల్‌ఏ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలు, క్షిపణి క్షేత్రాల ఏర్పాటు పనులను చకచకా సాగిస్తున్న చైనా ఇప్పుడు పాంగాంగ్‌ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని భారత్‌ సీరియ్‌సగా తీసుకుంది. తాజా ఘటనలో ఇరు సైన్యాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని భారత సైన్యం అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు.


‘‘సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. దేశ సమగ్రతను కాపాడే విషయంలో ఏ మాత్రం రాజీ లేదు. తాజా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సరిహద్దుల్లోని చుశుల్‌ వద్ద ఇరుదేశాల కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలుజరుగుతున్నాయి’’ అన్నారు. కాగా.. లద్దాఖ్‌తోపాటు ఎల్‌ఏసీ వెంబడి పలు ప్రదేశాల్లో చైనా సైన్యం మోహరించింది. దీంతో భారత్‌ అదనపు బలగాలను తరలించింది. వింటర్‌ పెట్రోలింగ్‌కు సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటనతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. చైనా కవ్వింపు చర్యలను దీటుగా ఎదుర్కోవాలని ఆర్మీ చీఫ్‌ ఎంఎం నవరణే ఆదేశించారు. తాజా ఘటనపై ప్రధాని మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆయనకు వివరిస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధికారులు కూడా చైనా కవ్వింపులపై సమీక్షలు జరిపా రు. గల్వాన్‌ ఉదంతం తర్వాత చైనా రాయబారి వీడాంగ్‌ మొసలి కన్నీళ్లు కార్చిన విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ఇరుదేశాల సైన్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పిన కొద్ది రోజులకే మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడటం గమనార్హం. ‘‘మా సైన్యం యథాతథ స్థితికి కట్టుబడే ఉంది. సరిహద్దులను దాటలేదు’’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జో లిజియన్‌ తాజా ఘటనపై పాత పాటే పాడారు. తూర్పు లద్దాఖ్‌ వద్ద చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చిన భారత సేనలు రిక్విన్‌ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్లు అధికారులు చెప్పారని చైనా అధికారిక టీవీ చానల్‌ సీజీటీఎన్‌ సోమవారం కొత్తపాట అందుకుంది. 




జే-20 ఫైటర్‌జెట్లను మోహరించిన చైనా

పాంగాంగ్‌ దక్షిణ తీరం వద్ద సరిహద్దులను మార్చాలన్న కుతంత్రానికి ఒకరోజు ముందే చైనా సైన్యం తన ఎయిర్‌బే్‌సలో జే-20 యుద్ధ విమానాలను మోహరించిం ది. టిబెట్‌లోని హోటన్‌, గారిగున్సా వాయుసేన స్థావరా ల్లో వీటికదలికలు చురుగ్గా ఉన్నాయి. గత మంగళవారం కూడా రెండు జే-20 యుద్ధవిమానాలతో చైనా వైమానిక దళం లద్దాఖ్‌కు సమీపంలో చక్కర్లు కొట్టింది. లద్దాఖ్‌ సమీపంలోని కాస్ఘర్‌, హోటన్‌, గారిగున్సాతోపాటు ఎల్‌ఏసీ వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ చైనా వైమానిక దళం యాక్టివ్‌గా ఉందని తెలిసింది. పాంగాంగ్‌ సరస్సు 604 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని పొడవు దాదాపు 134 కిలోమీటర్లు. వెడల్పు 5 కిలోమీటర్లు. ఈ సరస్సు 60ు టిబెట్‌లో విస్తరించి ఉంది. 1962 యుద్ధం తర్వాత ఎల్‌ఏసీని ఇరుదేశాల సరిహద్దుగా గుర్తిస్తున్నారు. ఈ సరస్సు మీదుగానే ఎల్‌ఏసీ వెళ్తోంది. పాంగాంగ్‌కు ఉత్తర తీరం లోని పర్వత శ్రేణులను ‘ఫింగర్స్‌’గా పిలుస్తారు. ఫింగర్‌-8 మీదుగా ఎల్‌ఏసీ వెళ్తుండగా భారత్‌కు ఫింగర్‌-4 వరకే పట్టుంది. చైనా సైన్యానికి ఫింగర్‌-8 వద్ద పోస్టు ఉంది. అయినా భారత్‌ వైపున ఫింగర్‌-2 వరకు ఉన్న భూభాగమంతా తనదేనని వాదిస్తోంది. సరస్సులోనూ మర బోట్లతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ భారత జలాల్లోకి యథేచ్ఛగా ప్రవేశిస్తోంది. దీంతో భారత్‌ కూడా అక్కడ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. హిందువులకు పవిత్ర స్థలమైన టిబెట్‌లోని కైలాస మానస సరోవరం వద్ద చైనా ఓ భారీ క్షిపణి క్షేత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో 4 నదులకు (సింఽధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌, కర్నాలి) పుట్టినిల్లయిన ప్రదేశంలో ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. ఈ పర్వతాన్ని బౌద్ధులు ‘కాంగ్‌ రింపోచే’గా పిలుస్తూ దర్శించుకుంటారు. 


చైనాపై మోదీ కన్నెర్ర చేయరా?: కాంగ్రెస్‌

చైనాపై ప్రధాని మోదీ కన్నెర్ర జేసేది ఎప్పుడని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘ఆత్మనిర్భర్‌, బొమ్మలు, భారత కుక్కల పై ప్రేమ వంటి వాటితో ప్రజల దృష్టిని మరల్చవచ్చు. కానీ, చైనాను వెనక్కి పంపే వ్యూహంలో మాత్రం గందరగోళం వద్దు’ అని మరో అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ ట్వీట్‌ చేశారు. కాగా.. చైనాపై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. మరోవైపు సరిహద్దులో భారత్‌ ప్రతిస్పందనను చైనా తేలిగ్గా తీసుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


మావో వ్యూహాన్నే జిన్‌పింగ్‌ అమలు చేస్తున్నారా?

చైనా కవ్వింపు చర్యలను చూస్తుంటే 1962 భారత్‌-చైనా యుద్ధం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నా యా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ఏదైనా సంక్షోభం చెలరేగినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్‌ను టార్గెట్‌గా చేసుకోవడం సాధారణమేనని విశ్లేషకులు అంటున్నారు. మావో జెడాంగ్‌ సమయంలో 1958 నుంచి ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం వంటి అంశాలు చైనాను అతలాకుతలం చేశాయి. 5 కోట్ల ఆకలి చావులు నమోదయ్యాయి. అప్పుడు విపక్షాల విమర్శలను అడ్డుకునేందుకు మావో లద్దాఖ్‌ సమీపంలో రోడ్ల నిర్మాణం చేపట్టి 1962 భారత్‌-చైనా యుద్ధానికి కారణమయ్యారు. చైనాలో ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.కరోనా కల్లోలం తర్వాత చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. దేశీయ కొనుగోళ్ల తలసరి వినియోగం కూడా 6ుకు పడిపోయింది. బ్యాంకుల్లో తీసుకునే రుణాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని చైనా జాతీయ ఆర్థికాభివృద్ధి సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడింది. అందుకే జిన్‌పింగ్‌ ‘క్లీన్‌ ప్లేట్‌’ ఉద్యమానికి నాంది పలికారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని 3 నెలల క్రితం పీఎల్‌ఏను జిన్‌పింగ్‌ ఆదేశించడం కూడా భారత్‌తో యుద్ధానికి చైనా సిద్ధమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


పడిపోయిన సెన్సెక్స్‌

భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా ఘర్షణ వార్తల ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై తీవ్రంగా పడిం ది. మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ 40 వేల మార్కును దాటింది. అంతలోనే సరిహద్దు ఘర్షణల వార్త లు రావడంతో సూచీలు నేల చూపులు చూశాయి. ఆ తర్వాత వెలువడ్డ జీడీపీ ఫలితాలు జీ-20 దేశాల్లో అత్యల్ప వృద్ధిరేటు భారత్‌లో నమోదు కానుందనే అంచనాలు మార్కెట్ల నేలచూపునకు ఊతమిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 839.02 పాయింట్లు కోల్పో యి 38,628.29 వద్ద ముగిసింది. నిఫ్టీకూడా 260.10 పాయింట్లు కోల్పోయి 11,387.50 వద్ద స్థిరపడింది. 

Updated Date - 2020-09-01T08:05:54+05:30 IST