కరోనా పుట్టింది భారత్‌లోనే
ABN , First Publish Date - 2020-12-01T08:00:31+05:30 IST
అమెరికా, స్పెయిన్, ఇటలీల్లో కరోనా వైరస్ పుట్టిందని గతంలో గట్టిగా వాదించిన చైనా ఇపుడు వైరస్ తొలిగా పుట్టినది భారత్‌లోనేనని ఓ కొత్త అభాండాన్ని వేస్తోంది...

- నిరుడు జూలై లోనే భారత్‌లో వ్యాప్తి
- ఆ తరువాతే వుహాన్‌లోకి చైనా కొత్త అభాండం
బీజింగ్, నవంబరు 30: అమెరికా, స్పెయిన్, ఇటలీల్లో కరోనా వైరస్ పుట్టిందని గతంలో గట్టిగా వాదించిన చైనా ఇపుడు వైరస్ తొలిగా పుట్టినది భారత్‌లోనేనని ఓ కొత్త అభాండాన్ని వేస్తోంది. ’’వుహాన్‌లో ఇది బయటపడడానికి కొన్ని నెలల ముందుగానే భారత్‌లో వ్యాప్తి చెందింది. 2019 జులై-ఆగస్టు నెలల్లో భారత్‌లో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైన వేళ- తాగునీటికి కటకట ఏర్పడింది. అపుడు భారత్‌లోని ప్రజానీకం, పశువులు ఒకే నీటివనరుల్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సంక్రమించడం మొదలైంది’’ అని ఓ అధ్యయన నివేదికను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
’’వివిధ దేశాల నుంచి వచ్చిన అనేక ఆహారపదార్థాలను చైనా పరిశోధనా సంస్థలు విస్తృతంగా అధ్యయనం చేశాయి. భారత్ నుంచి వచ్చిన ఓ చేపల సరుకును పరిశీలించినపుడు అందులో కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఆ కన్సైన్మెంట్ నిరుడు ఆగస్టులో వచ్చినది’’ అని అందులో పేర్కొంది. ’ఇది వుహాన్‌లో, హ్యుబై రాష్ట్రంలో కనుగొనక ముందే చాలా దేశాల్లో ఉండి ఉండొచ్చు. వైరస్ ఎక్కడ పుట్టిందీ, ఎలా వ్యాప్తి చెందిన్నది ప్రపంచదేశాలన్నీ అధ్యయనం చేయాలి. కేవలం వుహాన్ వైరస్ అని నిందవేయడం సరికాదు’ అని ఆ కథనంలో వ్యాఖ్యానించింది. వైరస్ వుహాన్‌లోని ఓ మాంసాహార, చేపల మార్కెట్లో పుట్టిందన్నది అన్ని దేశాలూ అంగీకరిస్తున్న కథనం. చైనా ఓ ల్యాబ్‌లో దీనిని కృత్రిమంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఎక్కువగానే వచ్చాయి. వాటిని అక్కడ పనిచేసిన బయో సైంటిస్టులే అంగీకరించడం కూడా జరిగింది.