కర్ణాటకలో 60 జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లతో చైనీయుడి మోసం గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-06-26T22:37:35+05:30 IST

చైనాలోని వూహన్‌కు చెందిన వ్యక్తికి సంబంధించిన 60 జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను)

కర్ణాటకలో 60 జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లతో చైనీయుడి మోసం గుట్టు రట్టు

బెంగళూరు : చైనాలోని వూహన్‌కు చెందిన వ్యక్తికి సంబంధించిన 60 జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) రిజిస్ట్రేషన్లను వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. అప్రకటిత గోదాములో నిల్వ చేసిన రూ.4 కోట్ల విలువైన చైనా తయారీ వస్తువులను స్వాధీనం చేసుకుంది. 


వాణిజ్య పన్నుల శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఓ చైనా జాతీయుడు వేర్వేరు పేర్లతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను రిజిస్టర్ చేయించాడు. కొందరు వ్యక్తుల పేర్లతో రిజిస్టర్ చేయించాడు. వీరిలో కొందరు కొన్ని కంపెనీల్లో మరికొందరు మరికొన్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. 


చైనా తయారీ వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించడం కోసం ఈ కంపెనీలను ఏర్పాటు చేసి, వేర్వేరు పేర్ల మీద జీఎస్‌టీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల పరిథిలో 60కి పైగా రిజిస్ట్రేషన్లను చేయించాడు. ఈ రిజిస్ట్రేషన్ల నుంచి రిటర్నులు సక్రమంగా  దాఖలు  కాకపోవడాన్ని అధికారులు గమనించారు. కొన్ని సంస్థలు రిటర్నులను దాఖలు చేయడం లేదని, మరికొన్ని సంస్థలు టర్నోవరు లేనట్లు చూపిస్తూ రిటర్నులు దాఖలు చేస్తున్నాయని గమనించారు. 


పాత విమానాశ్రయం రోడ్డులోని ఓ గోదాములో జరిపిన సోదాల్లో  25,446 చైనా తయారీ ఎలక్ట్రానిక్ వస్తువులను, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుంది. 


సోదాలు జరుగుతున్న సమయంలో ఆ చైనా జాతీయుడు కానీ, ఇతర 59 రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్స్ కానీ అందుబాటులోకి రాలేదు. వారికి తగినంత సమయం ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. 


ఆ చైనా జాతీయుడు ఈ వ్యాపారాలను చైనాలోని వూహన్‌లో ఉంటూ నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో కొందరు ఏజెంట్లు లేదా ఉద్యోగులను నియమించుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.


ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో మెరుగైన రేటింగ్ పొందడం కోసం అధిక రిజిస్ట్రేషన్లను చేయించినట్లు తెలిసిందని ఈ ప్రకటనను విడుదల చేసిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎంఎస్ శ్రీకర్ పేర్కొన్నారు.


Updated Date - 2020-06-26T22:37:35+05:30 IST