చొచ్చుకొచ్చిన చైనా సేన

ABN , First Publish Date - 2020-09-13T07:37:30+05:30 IST

లద్దాఖ్‌ తూర్పున చైనా సేన మరింత ముందుకు చొచ్చుకొచ్చింది.

చొచ్చుకొచ్చిన చైనా సేన

పాంగాంగ్‌ దక్షిణం వైపు స్పాంగుర్‌ కనుమ సమీపాన ఆక్రమణ

వందల సంఖ్యలో బలగాల మోహరింపు

దీటుగా సేనలను నిలబెట్టిన భారత్‌


లద్దాఖ్‌, సెప్టెంబరు 12: లద్దాఖ్‌ తూర్పున చైనా సేన మరింత ముందుకు చొచ్చుకొచ్చింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణాన ఉన్న కొండ శిఖరాలపై బలంగా పాతుకుపోయిన భారత దళాలను ఖాళీ చేయించే ఏకైక లక్ష్యంతో పీఎల్‌ఏ- తన సేనలను అతి సమీపానికి తరలించింది. దక్షిణ ప్రాంతంలో ఉన్న స్పాంగూర్‌ కనుమ వద్దకు వందల సంఖ్యలో బలగాలను, ట్యాంకులను, శతఘ్ని దళాలను చేర్చింది. ఇపుడు పరిస్థితేంటంటే... కొండలపై భారత దళాలున్నాయి... దిగువన గ్యాప్‌లో పీఎల్‌ఏ బలగాలున్నాయి. చైనా మోహరింపును వెంటనే పసిగట్టిన భారత్‌ కూడా స్పాంగూర్‌ కనుమ వద్ద గణనీయమైన సంఖ్యలో దళాలను మోహరించింది. ప్రస్తుతం రెండు దేశాల దళాలు షూటింగ్‌ రేంజ్‌లోకి వచ్చేశాయి. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారి- ఎప్పుడేం జరుగుతుందో అన్న రీతిగా మారింది. గురుంగ్‌, మగర్‌ కొండల మధ్య ఈ స్పాంగూర్‌ కనుమ ఉంది. ఆగస్టు 30నుంచే నెమ్మదిగా బలగాలను అక్కడికి చేర్చడం మొదలెట్టిన చైనా- గత రెండ్రోజుల్లో భారీగా దళాలను మిలటరీ ట్రక్కుల్లో దింపేసింది. ఆ వెంటే ట్యాంకులు, శతఘ్ని దళాలు వచ్చాయి. 


చర్చలు మరోసారి అసంపూర్ణం

పీఎల్‌ఏ దళాలతో పాటు పౌరసైన్యం (మిలీషియా స్క్వాడ్స్‌) కూడా ఉన్నట్లు భారత దళాలు గమనించాయి. యుద్ధ మెళకువలన్నీ నేర్చుకుని అవసరమైన సమయాల్లో రెగ్యులర్‌ దళాలకు సహాయపడే ఈ మిలీషియాలో పర్వతప్రాంతాల్లో సుళువుగా సంచరించగలిగేవారు, బాక్సర్లు, ఆయుధాలు లేకుండా గానీ, సంప్రదాయ ఆయుధాలతో పోరాడగలిగేవారు గానీ ఉంటారు. కొండలపై ఉన్న భారత దళాలపైకి ఉరికి వారిని నేలవాల్చి అక్కడ నుంచి ఖాళీ చేయించడానికే వీరిని పీఎల్‌ఏ తీసుకొచ్చి ఉంటుందని సైన్యం భావిస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కేవలం బలగాలే కాక- ట్యాంకులు, ఫిరంగి దళాలను భారత్‌ కూడా మోహరించింది. 


కాగా- ఉద్రిక్తతలు చల్లార్చేదిశగా భారత్‌- చైనాలు జరిపిన బ్రిగేడ్‌ కమాండర్ల స్థాయి చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. ఛుషుల్‌ సమీపాన శనివారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో ఈ చర్చలు సాగాయి. వెంటనే వెనక్కి వెళ్లాలని భారత్‌ కోరినా పీఎల్‌ఏ దళాలు అంగీకరించలేదు. ఛుషుల్‌ సమీపానే తిష్ట వేశాయి. దీంతో ఇరుదేశాల పటాలాల కమాండర్లు (కాప్స్‌ కమాండర్స్‌) ఆరోదఫా చర్చలు ప్రారంభించనున్నారు. 14వ పటాలం కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా కాప్స్‌ కమాండర్‌ లీ లిన్‌ త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి వీరిద్దరూ కలుసుకోలేదు. సంక్షోభ నివారణ చర్యల్ని చేపట్టే అధికారాన్ని చైనా పీఎల్‌ఏకే వదిలేసిన సంగతి తెలిసిందే. మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో అంగీకరించిన ఐదు సూత్రాల ప్రణాళికలో క్షేత్రస్థాయి కమాండర్లు దీనిపై చర్చించాలని ప్రస్తావించారు. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌లతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం నాడు సమగ్ర సమీక్ష జరిపిన తరువాత శనివారం ఉదయం బ్రిగేడ్‌ కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బ్రిగేడ్‌ కమాండర్లు చర్చలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో చైనా వైఖరి ఏమాత్రం మారలేదని సైనిక వర్గాలు అంటున్నాయి. కాప్స్‌ కమాండర్ల భేటీలో కూడా ఇది పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించాయి. సరస్సు దక్షిణ ప్రాంత మిట్టలపైనుంచి భారత్‌ ఒక్క అంగుళం కూడా వెనకడుగు వేయలేదు సరికదా, చైనా కవ్వింపుల్ని దీటుగా ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో బలగాలను కూడా ఆ కొండల వద్ద భారత్‌ మోహరించింది. ఫింగర్‌-4లో ఎక్కువ భాగం భారత అధీనంలో ఉంది. 

Updated Date - 2020-09-13T07:37:30+05:30 IST