బిడెన్ గెలిస్తే చైనా చేతుల్లోకి అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2020-08-22T05:46:08+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే అమెరికాను చైనా సొంతం చేసుకోవడం ఖాయమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గురువారం వరకు నాలుగు రోజుల పాటు జరిగిన వర్చువల్ డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున డెమొక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా 77 ఏళ్ల జో బిడెన్ తన నామినేషన్‌ను స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 74 ఏళ్ల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన పోటీ పడనున్నారు. కాగా ట్రంప్ ఇవాళ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జో బిడెన్ తన ప్రసంగంలో చైనా సహా పలు అంశాలపై మాట్లాడకపోవడాన్ని ప్రముఖంగా ప్రశ్నించారు.
2020 కౌన్సిల్ ఫర్ నేషనల్ పాలసీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ... ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఆక్రోశాన్ని, ద్వేషాన్ని తిరస్కరించాల్సిన సమయం ఇది. జీవితాలను నిర్దేశించగల అతి పెద్ద ఎన్నికలను మనం ఎదుర్కోబోతున్నాం. అమెరికాను ముక్కలు చేసేందుకు ప్రయత్నించే ఏ పార్టీ కూడా అమెరికా పౌరుడిని నడిపించజాలదు. గత రాత్రి జో బిడెన్ చాలా విషయాలు తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడలేదు. డెమొక్రాటిక్‌ల చేతుల్లో అదుపుతప్పిన నగరాల భద్రత గురించి ఆయన మాట్లాడలేదు. చైనా గురించి కనీసం ఏ రూపంలోనూ ప్రస్తావించలేదు. ఆయనే గనక గెలిస్తే ఇక మన దేశాన్ని చైనా కైవసం చేసుకోవడం ఖాయం..’’ అని పేర్కొన్నారు. జో బిడెన్ గెలవాలని చైనా బలంగా కోరుకుంటున్నట్టు ఇంటిజెన్స్ నివేదికలు కూడా చెబుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఒకవేళ నేను గెలవాలని చైనా కోరుకుంటే అంతకంటే అవమానం నాకు మరోటి ఉండదు.. వాళ్లు అలా కోరుకుంటారని నేను భావించడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.