భారత్‌ను వేడుకుంటున్న చైనా కంపెనీలు.. కరోనా కిట్ల నిషేధంతో కాళ్లబేరానికి..

ABN , First Publish Date - 2020-04-29T01:33:44+05:30 IST

కరోనా మహమ్మారితో పోరాడేందుకు, దేశంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు చైనా నుంచి కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లను భారత్...

భారత్‌ను వేడుకుంటున్న చైనా కంపెనీలు.. కరోనా కిట్ల నిషేధంతో కాళ్లబేరానికి..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో పోరాడేందుకు, దేశంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు చైనా నుంచి కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లను భారత్ దిగుమతి చేసుకుంది. అయితే వాటిలో నాణ్యత లేదని, సరైన ఫలితాలను ఇవ్వడం లేదని పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేయడంతో వాటి వినియోగించవద్దంటూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. అంతేకాకుండా నాసిరకమైన కిట్లన్నింటినీ చైనాకు తిరిగి పంపించేందుకు సిద్ధమైంది. కేంద్రం ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే చైనాకు చెందిన టెస్టింగ్ కిట్ల తయారీ కంపెనీలు స్పందించాయి. నాణ్యమైన పరికరాలనే తాము సరఫరా చేశామని, వైద్య పరికరాల నాణ్యత విషయంలో తాము పటిష్ఠ చర్యలు తీసుకుంటామని, తాము సరఫరా చేసిన కిట్లను నిషేధించవద్దని, దీనిపై పునరాలోచించాలని చైనా కంపెనీలు భారత్‌ను కోరాయి. దీనికి సంబంధించి ఐసీఎంఆర్‌తో చైనా రాయబార కార్యాలయ బృందం సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా చైనా రాయబారి వెయిడాంగ్ మాట్లాడుతూ,  క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్‌కు కరోనా టెస్టింగ్ కిట్లను సరఫరా చేసిన గువాంగ్జో వండ్ఫో బయోటెక్, జుహాయ్ లివ్సోన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీల టెస్టింగ్ కిట్లకు చైనా జాతీయ వైద్య ఉత్పత్తుల పాలనా విభాగం (ఎన్ఎంపీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని, పుణెలో ఉన్న జాతీయ వైరాలజీ సంస్థ కూడా వీటిని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదముద్ర వేసిందని అన్నారు. రాపిట్ టెస్టింగ్ కిట్ల స్టోరేజీ రవాణా వాడకంలో జాగ్రత్తలు పాటించకపోవడంవల్లే ఆయా కిట్లు సక్రమంగా పని చేసి ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.  వాస్తవాలను గమనించి చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కోరారు. కరోనా వైరస్ మానవాళి ఉమ్మడి శత్రువని, అందరం కలిసి ఒక్కటిగా పోరాడితేనే దానిపై విజయం సాధించగలమని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-29T01:33:44+05:30 IST