చైనాపై మరోమారు ట్రంప్ కన్నెర్ర
ABN , First Publish Date - 2020-04-12T07:10:33+05:30 IST
చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఫైర్ అయ్యారు. ‘‘చైనా ఎదగడానికి 30 ఏళ్ల పాటు అమెరికాను వాడుకుంది. అమెరికా మద్దతుతోనే అభివృద్ధి సాధించింది.
మమ్మల్ని వాడుకుని ఆ దేశం ఎదిగింది
డబ్ల్యూటీవోలో చేరాకే పురోగమనం
వాషింగ్టన్, ఏప్రిల్ 11: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఫైర్ అయ్యారు. ‘‘చైనా ఎదగడానికి 30 ఏళ్ల పాటు అమెరికాను వాడుకుంది. అమెరికా మద్దతుతోనే అభివృద్ధి సాధించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరాకే.. ఆ దేశం ఎదుగుదల మొదలైంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ స్పీడ్తో దూసుకుపోయింది. డబ్ల్యూటీవో నిబంధనలను చైనా అనుకూలంగా మార్చుకుంది. ఆ నిబంధనలు మాకు ప్రతికూలంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశం అనే పేరుతో చైనా ఎన్నో ప్రయోజనాలు పొందింది. ఆ దేశం మా పట్ల గౌరవభావంతో లేకుంటే.. మేం దాన్ని వదిలేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన వైట్హౌ్సలో విలేకరులతో మాట్లాడుతూ.. చైనాను ఇంకా ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తే.. అమెరికా కూడా అదేకోవలోకి వస్తుందన్నారు. ‘‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం. ఇంకా ఎంతో అభిృద్ధి చేసే అవకాశం మాకు ఉంది. చైనా తన మారక విలువను తగ్గించుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో వితరణకు సిద్ధమవ్వాలి’’ అని అన్నారు. కాగా.. అమెరికాలో లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ దిగజారిపోతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను ఎత్తివేయడంపై త్వరలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘‘నా జీవితంలో ఎన్నడూ అంతపెద్ద నిర్ణయం తీసుకుని ఉండను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. లాక్డౌన్ను ఎప్పుడు ఎత్తివేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు నిధులు ఇవ్వడంపై వచ్చేవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరోనా విజృంభన నేపథ్యంలో వీసాలపై ఆంక్షలు విధించాలంటూ ట్రంప్ ఓ మెమొరాండమ్ను విడుదల చేశారు. ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. దీని మేరకు.. కొత్త వీసా దరఖాస్తులను ఎలాంటి వివరణ ఇవ్వకుండానే.. ఈ ఏడాది చివరి వరకు పెండింగ్లో పెడతారు. దేశ చట్టాలను ఉల్లంఘించిన వీసాదారులను గుర్తించి, వారి దేశాలకు తిప్పి పంపుతారు. కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంయుక్తంగా అప్లికేషన్ను అభివృద్ధి చేస్తాయని ట్రంప్ వెల్లడించారు. పౌరుల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లకుండా ఈ సాంకేతిక ఉంటుందని గూగుల్ , యాపిల్ వెల్లడించాయి.