పని మొదలెట్టేసిన చైనా.. నేపాల్ భూభాగాలనూ ఆక్రమిస్తోంది..

ABN , First Publish Date - 2020-06-23T20:20:42+05:30 IST

చైనా తమ వెనకుందన్న గర్వంతో ఇన్నాళ్లూ అండగా ఉన్న భారత్‌ పైనే నేపాల్ కాలు దువ్వింది. దశాబ్దాలుగా భారత్‌లో...

పని మొదలెట్టేసిన చైనా.. నేపాల్ భూభాగాలనూ ఆక్రమిస్తోంది..

ఖాట్మండు: ‌చైనా తమ వెనకుందన్న గర్వంతో ఇన్నాళ్లూ అండగా ఉన్న భారత్‌ పైనే నేపాల్ కాలు దువ్వింది. దశాబ్దాలుగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలను తమవిగా చూపిస్తూ ఓ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దానికోసం పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ సవరణలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఎవరిని చూసైతే నేపాల్ ఎగిరెగిని పడిందో ఆ చైనానే నేపాల్ భూభాగాలను ఆక్రమిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని 4 నేపాల్ జిల్లాలలో ఇప్పటికే 0.36 చదరపు కిలోమీటర్ల మేర చైనా చొరబడినట్లు నేపాల్ వ్యవసాయ శాఖ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. టిబెట్‌లో చైనా చేపడుతున్న భారీ రోడ్డు అభివృద్ధి పనుల వల్ల నదులు తమ దారి మళ్లించుకుంటున్నాయని, దీనివల్ల ఇప్పటికే 36 హెక్టార్ల మేర దేశ భూభాగాన్ని కోల్పోయామని ఆ నివేదిక ద్వారా ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే వదిలేస్తే చైనా ఆయా ప్రాంతాల్లో సైనిక పోస్టులను పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని హెచ్చరించింది. 


ఇదిలా ఉంటే చైనా ఈ విధంగా నేపాల్ భూభాగాన్ని ఆక్రమిస్తోందన్న సమాచారం ప్రధాని ఓలీకి ఏడాది క్రితమే అందింది. చైనా ఆక్రమిస్తున్న ప్రాంతాల్లోని నేపాల్ ప్రజలు పలు చోట్ల నిరసనలు తెలపడంతో ఓలీ ఇరకాటంలో పడ్డారు. అయితే చైనా సలహాతో సమస్యను తెలివిగా భారత్‌వైపు మళ్లించారు. భారత్‌లోని 330 చదరపు కిలోమీట్ల భూభాగం తమదేనంటూ ఓ సరికొత్త మ్యాప్‌ను విడుదల చేయడమే కాకుండా, దానికి రాజ్యాంగ సవరణల ద్వారా హుటాహుటిన చట్టబద్ధత కూడా కల్పించారు. దీంతో ప్రజల దృష్టి కూడా ఈ విషయంపైకి మళ్లించగలిగారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతాల్లో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓలీ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Read more