మన ప్రముఖులపై చైనా నిఘా

ABN , First Publish Date - 2020-09-18T07:15:39+05:30 IST

భారతీయ ప్రముఖలపై చైనా సంస్థ నిఘా పెట్టిన వార్తలపై కేంద్రం సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ నేతృత్వంలో ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది...

మన ప్రముఖులపై చైనా నిఘా

  • సైబర్‌ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు
  • లద్దాఖ్‌లో దళాల్ని వెనక్కి తీసుకోండి
  • చైనాను కోరిన భారత్‌
  • దేశీయ వస్తువులనే కొనండి
  • చైనాతో ఘర్షణల నేపథ్యంలో 
  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: తూర్పు లద్దాఖ్‌లో దళాలను తక్షణం ఉపసంహరించాలని భారత్‌ చైనాకు విజ్ఞప్తి చేసింది. వాస్తవాధీన రేఖను గౌరవించి, ఉద్రిక్తతలను చల్లార్చాలని కోరింది. ‘ఈనెల 4, 10 తేదీల్లో రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీలో కుదరిన ఏకాభిప్రాయం ప్రకారం... దళాలను వెంటనే వెనక్కి తీసుకురావడంలో మాతో కలిసి పనిచేయాలి. ఘర్షణలకు తావున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించి, మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాల్ని నివారించాలి. గత ఒప్పందాలను గౌరవించాలి. ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితి మార్చే ఏ చర్యకూ దిగరాదు’’ అని విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం నాడు పేర్కొన్నారు.  కాగా- భారతీయ ప్రముఖలపై చైనా సంస్థ నిఘా పెట్టిన వార్తలపై కేంద్రం సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ నేతృత్వంలో ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.


‘మన దేశ ప్రజల, ప్రముఖుల వ్యక్తిగత వివరాల సేకరణ-విశ్లేషణ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణిస్తోంది. దీనిపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీని నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వమన్నాం. ఈ అంశాన్ని గురువారం నాడు న్యూఢిల్లీలోని చైనా రాయబారిని పిలిపించి ఆయన దృష్టికి తెచ్చాం. అలాగే బీజింగ్‌లోని మన రాయబారి కూడా చైనా విదేశాంగ శాఖతో ఈ విషయమై మాట్లాడారు. అయితే చైనా మాత్రం - సదరు జెన్‌హువా సంస్థకు తమకు సంబంధం లేదని బదులిచ్చింది. అది ఒక ప్రైవేటు కంపెనీ అని, దాని కార్యకలాపాలు స్వతంత్రంగా సాగుతాయని తెలిపింది’ అని విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌- కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌కు రాసిన ఓ లేఖలో వివరించారు. 

Updated Date - 2020-09-18T07:15:39+05:30 IST