భారత్‌తోనే కాదు.. భూటాన్‌తోనూ సమస్యే : చైనా అధికారిక ప్రకటన

ABN , First Publish Date - 2020-07-05T15:58:15+05:30 IST

భారత్‌తోనే కాదు.. భూటాన్ తోనూ సరిహద్దు సమస్యలున్నాయని చైనా అధికారికంగా ప్రకటించింది.

భారత్‌తోనే కాదు.. భూటాన్‌తోనూ సమస్యే : చైనా అధికారిక ప్రకటన

బీజింగ్ : భారత్‌తోనే కాదు.. భూటాన్ తోనూ సరిహద్దు సమస్యలున్నాయని చైనా అధికారికంగా ప్రకటించింది. ఇలా అధికారికంగా చైనా ప్రకటించడం ఇదే ప్రథమం. ఈ ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో ఉన్నందున భారత్‌ కూడా గణనీయంగా ప్రభావానికి లోనవుతుందని చైనా పేర్కొంది. ‘‘చైనా- భూటాన్ సరిహద్దును ఎప్పుడూ విడదీయలేదు. తూర్పు, మధ్య, పశ్చిమ భాగాలపై చాలా కాలంగా వివాదాలు ఉండనే ఉన్నాయి’’ అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.


అయితే చైనా -భూటాన్ సరిహద్దు సమస్యలో మాత్రం మూడో పక్షం జోక్యాన్ని మాత్రం సహించే ప్రసక్తే లేదని అన్యాపదేశంగా భారత్‌ను హెచ్చరించింది. అయితే భూటాన్ చైనా ప్రకటనపై స్పందించింది. ఇది పూర్తిగా కొత్త ఆరోపణ అని పేర్కొంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకార ఒప్పంద పత్రాల ప్రకారం మాత్రం పశ్చిమ భాగం, మధ్య భాగంలోని సరిహద్దు సమస్యలు మాత్రమే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.


అయితే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిన నేపథ్యంలో ప్రధాని మోదీ లడాఖ్‌లో పర్యటించి... ‘‘విస్తరణ వాదం ముగిసినట్లే. ఇప్పుడంతా అభివృద్ధి వాదమే.’’ అని చైనాకు చురకలంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను దృష్టిలో పెట్టుకునే చైనా భూటాన్ సమస్యను లేవదీసినట్లు కొందరు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2020-07-05T15:58:15+05:30 IST