పూటకో మాట.. రోజుకో మ్యాపు

ABN , First Publish Date - 2020-06-22T07:20:43+05:30 IST

భారత్‌తో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై చైనా చెప్పే అసత్యాలకు, ఆడే నాటకాలకూ అంతూపొంతూ లేకుండా పోతోంది. కమ్యూనిస్టులు చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన 1950ల నుంచీ పూటకో మాట చెబుతోంది. రోజుకో మ్యాప్‌ విడుదల చేస్తోంది. ఒప్పందాలు చేసుకుందామని ఒత్తిడి తెచ్చేదీ తానే...

పూటకో మాట.. రోజుకో మ్యాపు

  • ఎల్‌ఏసీపై చైనావన్నీ డ్రామాలే!
  • ప్యాంగాంగ్‌ నుంచి గాల్వన్‌ వరకు కన్ను

భారత్‌తో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై చైనా చెప్పే అసత్యాలకు, ఆడే నాటకాలకూ అంతూపొంతూ లేకుండా పోతోంది. కమ్యూనిస్టులు చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన 1950ల నుంచీ పూటకో మాట చెబుతోంది. రోజుకో మ్యాప్‌ విడుదల చేస్తోంది. ఒప్పందాలు చేసుకుందామని ఒత్తిడి తెచ్చేదీ తానే... వాటిని మొదటి రోజే ఉల్లంఘించేదీ తానే. ఎల్‌ఏసీపై తన వైఖరేంటో అధికారిక రాజకీయ మ్యాపులో చూపదు. తాను నిర్దుష్టంగా అనుకున్నదేమిటో అందులో చెప్పదు. కానీ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. ఇండియానే రేఖ దాటివచ్చిందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తుంటుంది.


మంచు కొండల్లో భారత్‌ తనపై వ్యూహాత్మకంగా పైచేయి సాధించకుండా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాన అక్సాయ్‌చిన్‌ నుంచి దిగువన ప్యాంగాంగ్‌ నది వరకు మొత్తం తనదేనని అడ్డంగా వాదిస్తోంది. ఈ నెల 15న గాల్వన్‌ లోయలో చై నా దుస్సాహసం కూడా ఈ కోవలోనిదే అయినా.. దాని అసలు ఎత్తుగడ మాత్రం వేరే ఉంది. లేహ్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీ రోడ్డు, దీని నుంచి శ్యోక్‌-గాల్వన్‌ నదుల సంగమ ప్రాంతానికి భారత్‌ నిర్మించిన వంతెన.. భారత్‌కు ఎంతో కీలకమైనవి. వ్యూహాత్మకంగా అటు పాకిస్థాన్‌, ఇటు చైనాను నిలువరించేందుకు ఇవి కీలక మార్గాలు. ఈ కారణంగానే ఈ ప్రాంతం మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఎల్‌ఏసీ పేరిట తరచూ పెడుతున్న పేచీల పరమార్థమిదే.


ఆ వంతెన కీలకం.. 

లేహ్‌-ఓల్డీ రోడ్డు నుంచి పశ్చిమాన శ్యోక్‌-గాల్వన్‌ వంతెన నిర్మాణాన్ని భారత్‌ బలగాలు కొద్దిరోజుల క్రితమే పూర్తిచేశాయి. ఇది పూర్తికాకుండా అడ్డుకోవడానికే 15న చైనా మన బలగాలపై దాడికి పాల్పడింది. లేహ్‌-ఓల్డీ రోడ్డు నుంచి ఈ వంతెన మీదుగా గాల్వన్‌ లోయకు, అక్కడి నుంచి చైనా ఫార్వర్డ్‌ పోస్టుల వైపు అతి తక్కువ సమయంలో బలగాలను తరలించడానికి భారత్‌కు అవకాశం దక్కింది. ఈ కారణంగా అక్సాయ్‌చిన్‌, టిబెట్‌ నుంచి గాల్వన్‌ లోయను దాటి చైనా బలగాలు లేహ్‌ వైపు రాకుండా అడ్డుకోగలుగుతుంది. కొద్దిరోజుల కింద జరిగిన మేజర్‌ జనరళ్ల సమావేశంలో అక్కడి ఎల్‌ఏసీని గౌరవిస్తామని చైనా సైన్యాధికారులు మాటిచ్చారు. ఆ మర్నాడే మొత్తం గాల్వన్‌ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ వాదనను భారత్‌ తోసిపుచ్చింది. లేహ్‌ నుంచి దౌలత్‌ బేగ్‌ ఓల్డీ రోడ్‌కు రోడ్డు నిర్మాణం చాలావరకు పూర్తి కావచ్చింది. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మన చివరి సరిహద్దు పోస్టు కారకోరం ఉంది. దీనికి దిగువన కీలకమైన సియాచిన్‌ గ్లేసియర్‌ ప్రాంత ముంది. కారకోరం, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వ్యూహాత్మకంగా కీలకమైనవి. బాల్టిస్థాన్‌, గ్వాదర్‌ పోర్టుకు వెళ్లడానికి చైనాకు ఇటే దగ్గరి మార్గం. లేహ్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీ రోడ్డు పూర్తవు న్న తరుణంలో చైనా తాజా దుస్సాహసానికి దిగింది. 


ఎన్ని ఎల్‌ఏసీలు..?

ఉభయ దేశాలూ అంగీకరించిన ఎల్‌ఏసీ విషయంలో, మ్యాపుల విషయంలో చైనా ఎన్ని సార్లు మాట మార్చిందో అంతులేదు. 1956లో తాము విడుదల చేసిన రాజకీయ మ్యాపు నిజమైనదని 1959లో నాటి ప్రధాని చౌ ఎన్‌లై తెలిపారు. అందులో గాల్వన్‌ లోయ మొత్తం భారత్‌ అధీనంలోనే ఉంది. మరుసటి ఏడాది విడుదల చేసిన మ్యాపులో ఈ లోయ మొత్తం తన భూభాగమేనని పేర్కొంది. 1962లో ఇంకో మ్యాపులోనూ ఇదే విష యం వెల్లడించింది. ఆ తర్వాత విడుదల చేసిన మ్యాపు ల్లో గాల్వన్‌ నదికి పశ్చిమ భాగాన్ని తన ప్రాంతంగా చూ పకపోవడం గమనార్హం. నిజానికి ప్రస్తుతం చైనా ఆక్రమించుకుని ఉన్న 38 వేల చదరపు కిలోమీటర్లూ తనవేనని, అక్సాయ్‌చిన్‌ ఆవల ఉన్న ఎల్‌ఏసీ వరకు తనకే సార్వభౌమాధికార హక్కుందని భారత్‌ అంటోంది. అయి తే ఇప్పుడు గాల్వన్‌ లోయలోని ఎల్‌ఏసీనే గౌరవిస్తోంది. ఈ రేఖపై రెండు దేశాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గాల్వన్‌ లోయ మొత్తం తనదేననడం ద్వారా చైనా ఏకపక్షంగా ఎల్‌ఏసీని మార్చాలని చూస్తోంది.


1993లో కుదిరిన సరిహద్దు శాంతి-సామరస్య ఒప్పందం (బీపీటీఏ) ప్రకారం.. ఆనాటికి ఇరు దేశాలూ ఏల్‌ఏసీగా భావిస్తున్న ప్రాంతాన్నే గౌరవించాలని నిర్ణయించారు. 1996లో చేపట్టిన విశ్వాస కల్పన చర్యల ఒప్పందం ప్రకారం.. పశ్చిమ సెక్టార్‌కు సంబంధించిన తన రాజకీయ మ్యాప్‌ను ఇచ్చేందుకు చైనా నిరాకరించడం గమనార్హం. అంటే ఒప్పందాల దారి ఒప్పందాలదే. ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేనన్నట్లుగా వ్యవహరిస్తోంది.


8 ఫింగర్స్‌..  

ప్యాంగాంగ్‌ లేక్‌ తీరం పొడవునా 8 ఫింగర్స్‌ ప్రాంతం ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి ఆరు ఫింగర్స్‌ వరకు భారత్‌ అధీనంలో ఉన్నా యి. ఏడో ఫింగర్‌ ప్రాంతానికి కాస్త మధ్యలో ఎల్‌ఏసీ ఉందని భారత్‌ అంటుండగా.. పశ్చి మం నుంచి తూర్పు వైపు నాలుగో ఫింగర్‌ ప్రాం తం వద్ద వాస్తవాధీన రేఖ ఉందని చైనా వాదించింది. ఇప్పుడిదంతా తనదేనని అంటోంది. నాలు గో ఫింగర్‌ వద్ద మన ఐటీబీపీ పోస్టు ఉన్న చోట ఎలాంటి రోడ్డు లేదు. ఇక్కడ భారత బలగాలు మోహరించాయన్న మాటల్లో నిజమే లేదు. 7-8 ఫింగర్స్‌ మథ్య చైనా ఫార్వర్డ్‌ పోస్టు ఉంటుంది. 


- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-22T07:20:43+05:30 IST