ఐదుగురు భారతీయులను కిడ్నాప్‌ చేసిన చైనా

ABN , First Publish Date - 2020-09-06T07:32:02+05:30 IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న దశలో చైనా ఓ దుశ్చేష్టకు పాల్పడింది.

ఐదుగురు భారతీయులను కిడ్నాప్‌ చేసిన చైనా

ముగ్గురు చైనీయులను కాపాడిన భారత్‌


ఇటానగర్‌/గ్యాంగ్‌టక్‌: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న దశలో చైనా ఓ దుశ్చేష్టకు పాల్పడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించాయి. అప్పర్‌ సుబన్‌సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో అడవిలో వేటకు వెళ్లిన వారిని చైనా దళాలు కిడ్నాప్‌ చేశాయి. ఆ ఐదుగురితో పాటు ఉన్న మరో ఇద్దరు తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది బయటపడింది. దీనిపై దర్యాప్తు సాగుతోంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి భారత అడవుల్లోకి జొరబడ్డాయని స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  నినాంగ్‌ ఎరింగ్‌ - ప్రధాని కార్యాలయానికి పంపిన ఓ ఫిర్యాదులో పంపారు. కాగా- సిక్కిం ఉత్తరప్రాంతంలో వాస్తవాధీనరేఖ సమీపాన దారి తప్పి వచ్చిన ముగ్గురు చైనా పౌరులను భారత సైన్యం కాపాడింది. 17,500 మీటర్ల ఎత్తున సబ్‌ జీరో ఉష్ణోగ్రతలు మనిషుల్ని గడ్డ కట్టిస్తుండగా- చైనా పౌరులను సైన్యం కనుగొంది. వారికి వెంటనే ఆక్సిజన్‌ ఇచ్చి స్వస్థుల్ని చేసింది. ఆ తరువాత తగిన మందులు, ఆహారం, కంబళ్లు ఇచ్చి సురక్షితంగా సాగనంపింది.

Updated Date - 2020-09-06T07:32:02+05:30 IST