విదేశీ కాన్సులేట్లపై చైనా కన్ను!
ABN , First Publish Date - 2020-12-15T07:47:19+05:30 IST
తన దేశంలోని విదేశీ కాన్సులేట్లు, బహుళ జాతి సంస్థల కార్యాలయాల్లోకి చైనా తన గూఢచారులను చొరబెడుతోంది.

షాంఘై కార్యాలయాల్లో గూఢచర్యం!!
కమ్యూనిస్టు కార్యకర్తలను చొరబెడుతున్న డ్రాగన్
భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ టార్గెట్?
మెల్‌బోర్న్/వాషింగ్టన్, డిసెంబరు 14: తన దేశంలోని విదేశీ కాన్సులేట్లు, బహుళ జాతి సంస్థల కార్యాలయాల్లోకి చైనా తన గూఢచారులను చొరబెడుతోంది. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్, విమానయాన సంస్థ బోయింగ్‌తోపాటు ప్రసిద్ధ బహుళ జాతి సంస్థల ఆఫీసుల్లో, కనీసం పది విదేశీ రాయబార కార్యాలయాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) కార్యకర్తలు చోటు సంపాదించి.. సైబర్ గూఢచర్యంతో అక్కడి వివరాలు తమ ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా సోమవారం కథనాలు ప్రచురించింది. ప్రధానంగా ఆర్థిక నగరం షాంఘైలోని భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణాఫ్రికా సహా పది విదేశీ కాన్సులేట్లలో సీపీసీ ఆపరేటివ్‌లు చొరబడ్డారని తెలిపింది. ఇది కనీసం దశాబ్ద కాలంగా జరుగుతోందని లీకైన కొన్ని డాక్యుమెంట్లను ఉటంకించింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి అగ్రస్థాయి ఔషధ సంస్థలు, ఫోక్స్‌వ్యాగన్ వంటి విమానయాన, వాహన సంస్థలు, ఏఎన్‌జడ్, హెచ్‌ఎ్‌సబీసీ వంటి అంతర్జాతీయ బ్యాంకులు, రక్షణ సంస్థల ఆఫీసుల్లో సీపీసీ గూఢచారులు ఉన్నారని ‘ది ఆస్ట్రేలియన్’ వెల్లడించింది.
షాంఘై ఫారిన్ సర్వీస్ ఏజెన్సీ సర్వీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా కమ్యూనిస్టు కార్యకర్తలను ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వం రిక్రూట్ చేస్తున్నట్లు తేలింది. 20 లక్షల మంది సీపీసీ సభ్యులు దేశ విదేశాల్లో గూఢచర్యంలో పాల్గొంటున్నారంటూ వారి పేర్లు, పార్టీలో నిర్వహిస్తున్న పదవులు, పుట్టిన తేదీ, జాతీయ గుర్తింపు కార్డులు తదితర సమాచారం సదరు డాక్యుమెంట్లలో ఉన్నట్లు ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక పేర్కొంది. ఈ డేటా బేస్‌ను చైనా విజిల్‌బ్లోయర్లు 2016 జూలైలో షాంఘైలోని ఓ సర్వర్ నుంచి తీసుకున్నారు. దానిని ఈ ఏడాది సెప్టెంబరులో ఓ ఇంటర్-పార్లమెంటరీ గ్రూప్‌కు పంపించారు. చైనా వ్యవహారాలపై ఏర్పాటైన ఈ గ్రూపులో వివిధ ప్రజాస్వామిక దేశాలకు చెందిన 150 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కాగా, అమెరికా ప్రభుత్వ కార్యాలయాల్లో నెలపాటు పెద్దఎత్తున హ్యాకింగ్ జరిగినట్లు తేలింది. దీంతో ట్రెజరీ, వాణిజ్య శాఖల్లో నెట్‌వర్క్‌లను ప్రక్షాళన చేయాలని.. డేటా లీకైన సర్వర్లను డిస్‌కనెక్ట్ చేసేయాలని అమెరికా ప్రభు త్వ సంస్థలు ఆదివారం అర్ధరాత్రి అత్యవసర ఆదేశాలను జారీచేశాయి.