చైనా నోట మళ్లీ అదేమాట

ABN , First Publish Date - 2020-06-19T03:03:54+05:30 IST

బీజింగ్: ఈ నెల 15న లడక్ గల్వాన్ లోయలో ఘర్షణకు భారత బలగాలే కారణమని చైనా మరోమారు ఆరోపించింది. రెండు దేశాల సైన్యాధికారులు జరిపిన చర్చలు ఓ కొలిక్కి వస్తోన్న తరుణం...

చైనా నోట మళ్లీ అదేమాట

బీజింగ్: ఈ నెల 15న లడక్ గల్వాన్ లోయలో ఘర్షణకు భారత బలగాలే కారణమని చైనా మరోమారు ఆరోపించింది. రెండు దేశాల సైన్యాధికారులు జరిపిన చర్చలు ఓ కొలిక్కి వస్తోన్న తరుణంలో భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ బలగాలతో బాహాబాహీకి దిగాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జో లిజియాన్ ఆరోపించారు. ఇదే విషయాన్ని చైనా మళ్లీ మళ్లీ చెబుతోందని ఆయన గుర్తు చేశారు.  


వాస్తవానికి ఈ నెల 15న లడక్ గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖను దాటడంతో పాటు అక్కడ టెంట్లు వేసుకుని గోడ నిర్మించేందుకు యత్నించిన చైనా బలగాలను భారత బలగాలు అడ్డుకున్నాయి. ఆ సమయంలో ముందే కుట్రపూరితంగా సిద్ధం చేసుకున్న లాఠీలు, రాడ్లు, రాళ్లతో చైనా బలగాలు భారత జవాన్లపై దాడికి దిగాయి. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఘర్షణలో చైనా వైపు 43 మంది చనిపోయారని కథనాలు వస్తున్నా చైనా ధృవీకరించడం లేదు. ఐతే చైనా మాత్రం బుకాయిస్తూ నెపం భారత్‌పైకి నెడుతోంది. భారత విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి చైనా సైన్యం నిర్వాకంపై గట్టిగానే నిలదీశారు. అయితే చైనా మాత్రం తప్పును అంగీకరించడం లేదు. సైనికుల ప్రాణాత్యాగాలను వృధా పోనీయమన్న ప్రధాని మోదీ ఏం చేస్తారోనని జాతి యావత్తూ ఎదురుచూస్తోంది. చైనాకు గట్టి గుణ పాఠం నేర్పాలంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.    

Updated Date - 2020-06-19T03:03:54+05:30 IST