రెచ్చగొడితే దీటుగా బదులిస్తాం

ABN , First Publish Date - 2020-06-18T07:04:52+05:30 IST

సరిహద్దుల్లో భారత్‌ శాంతినే కోరుకుంటుందని.. రెచ్చగొడితే మాత్రం తగిన సమాధానం ఇవ్వగల సత్తా మనకుందని ప్రధాని మోదీ అన్నారు. మన జవాన్లు చేసిన త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు...

రెచ్చగొడితే దీటుగా బదులిస్తాం

  • దేశ సమగ్రతపై రాజీ పడం: మోదీ
  • భారత్‌.. శాంతిని ప్రేమించే దేశం
  • పొరుగు దేశాల క్షేమాన్ని కోరుకుంటాం
  • విభేదాలు తగాదాలుగా మారకుండా
  • ఉండడానికే మనం ప్రయత్నిస్తాం
  • మన ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగంలో 
  • ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటాం
  • జవాన్ల త్యాగం వృథాగా పోదు: ప్రధాని
  • చైనాపై రేపు అఖిల పక్ష సమావేశం

న్యూఢిల్లీ, జూన్‌ 17: సరిహద్దుల్లో భారత్‌ శాంతినే కోరుకుంటుందని.. రెచ్చగొడితే మాత్రం తగిన సమాధానం ఇవ్వగల సత్తా మనకుందని ప్రధాని మోదీ అన్నారు. మన జవాన్లు చేసిన త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. దేశంలో తీవ్రమవుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రులతో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా.. మన జవాన్ల మృతికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘‘భారతదేశం సాంస్కృతికంగా శాంతిని ప్రేమించే దేశం. మనం మన పొరుగుదేశాలతో ఎప్పుడూ సహకార, స్నేహభావంతోనే కలిసి పనిచేశాం. ఎల్లప్పుడూ వారి అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకున్నాం. ఎవరినీ ఎప్పుడూ కవ్వించలేదు. అదే సమయంలో.. మన దేశ సమగ్రత,  సార్వభౌమాధికారాన్ని కాపాడే విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ విషయంలో మన సత్తాను నిరూపించుకున్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.


వీరజవాన్లు గొప్ప త్యాగం చేశారని కొనియాడారు. సరిహద్దుల్లో వీరమరణం పొందిన ఆ జవాన్ల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశమంతా వారికి అండగా ఉంటుందన్నారు. ‘‘మన అమరవీరుల త్యాగాలు వృథాగా పోవు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారతదేశం తన ఆత్మగౌరవాన్ని, తన భూభాగంలో ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటుంది. విభేదాలు తగాదాలుగా మారకుండా ఉండడానికే భారత్‌ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారమే మనకు సర్వోత్కృష్టమైనది. వాటిని కాపాడుకునే క్రమంలో మనను ఎవరూ ఆపలేరు. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు.’’ అని తేల్చిచెప్పారు. కాగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ఆన్‌లైన్‌ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులూ హాజరవుతారని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది. అమరజవాన్ల ధైర్యసాహసాలను, వారు చేసిన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. మన వీరజవాన్లు చేసిన గొప్ప త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ దుఃఖసమయంలో మోదీ సర్కారు, యావద్దేశం ఆ అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. గొప్ప వీరులను అందించిన వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని అమిత్‌ షా పేర్కొన్నారు. ఇక.. గాల్వన్‌లో సైనికులను కోల్పోవడం ఎంతగానో బాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘర్షణలు జరిగిన తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై రాజ్‌నాథ్‌ త్రివిధ దళాధిపతులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ కూడా మంగళవారం రాత్రి.. మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, జైశంకర్‌, నిర్మలాసీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణేతో సమీక్షించారు. 




చికిత్స పొందుతున్న 18 మంది సైనికులు

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన 18 మంది సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఇక.. లద్దాఖ్‌లో అమరులైన జవాన్లకు భారతదేశం ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే సానుభూతి తెలిపారు. ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల పేర్లను ఆర్మీ విడుదల చేసింది. వారి పేర్లు.. కర్నల్‌ బికుమళ్ల సంతోష్‌ బాబు; నాయబ్‌ సుబేదార్‌ నుదురామ్‌ సోరెన్‌; నాయబ్‌ సుబేదార్‌ మన్‌దీ్‌ప సింగ్‌; నాయబ్‌ సుబేదార్‌ సత్నామ్‌ సింగ్‌; హవల్దార్‌ కె.పళని; హవిల్దార్‌ సునీల్‌ కుమార్‌; హవల్దార్‌ బిపుల్‌ రాయ్‌; నాయక్‌ దీపక్‌ కుమార్‌; సిపాయి రాజేశ్‌ ఒరాంగ్‌; సిపాయి కుందన్‌ కుమార్‌ ఓఝా; సిపాయి గణేశ్‌ రామ్‌; సిపాయి చంద్రకాంత ప్రధాన్‌; సిపాయి అంకుశ్‌; సిపాయి గుర్వీందర్‌; సిపాయి గురుతేజ్‌ సింగ్‌; సిపాయి చందన్‌ కుమార్‌; సిపాయి కుందన్‌ కుమార్‌; సిపాయి అమన్‌ కుమార్‌; సిపాయి జైకిశోర్‌ సింగ్‌; సిపాయి గణేశ్‌ హన్స్‌దా.


అప్రమత్తత స్థాయిని పెంచిన దళాలు

లద్దాఖ్‌లో చైనా సైనికుల హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. మహాదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌తోపాటు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జరిపిన అత్యున్నతస్థాయి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఇరుదేశాల మధ్య 3500 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వద్ద ఆర్మీ, వైమానిక దళం అప్రమత్తత స్థాయిని పెంచాయి. అక్కడి స్థావరాలకు అదనపు బలగాలను పంపాయి. హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. మలక్కా జలసంధిలో, భారత పసిఫిక్‌ ప్రాంతంలో మోహరింపులు చేయాల్సిందిగా నౌకాదళానికి, కీలక స్థావరాల్లో యుద్ధవిమానాలను మోహరించాలని వైమానిక దళానికి రక్షణశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.


35 మంది చైనీయుల మృతి!

అమెరికా నిఘావర్గాల అంచనా

లద్దాఖ్‌లో సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణలో చైనా సైనికులు 35 మంది దాకా మరణించినట్లు అమెరికా నిఘావర్గాల సమాచారం. చనిపోయిన చైనా జవాన్లలో బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కూడా ఉన్నట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది. అయితే, చైనా మాత్రం.. చనిపోయిన తమ సైనికుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. తమ వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్టు చైనీస్‌ మీడియా పేర్కొంటోంది. 1967లో నాథులా కనుమ వద్ద జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల సైన్యాల నడుమ జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే. 1967లో భారత్‌ 80 మంది సైనికులను కోల్పోగా.. 300 మందికిపై చైనా జవాన్లు చనిపోయారు.


Updated Date - 2020-06-18T07:04:52+05:30 IST