చైనాకు మరో షాక్! లద్దాఖ్ వివాదం కొనసాగుతుండగానే...

ABN , First Publish Date - 2020-06-23T00:38:31+05:30 IST

ఓ వైపు భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలోనే చైనాకు జపాన్ రూపంలో మరో సమస్య వచ్చిపడంది.

చైనాకు మరో షాక్! లద్దాఖ్ వివాదం కొనసాగుతుండగానే...

టోక్యో: ఓ వైపు భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలోనే చైనాకు జపాన్ రూపంలో మరో సమస్య వచ్చిపడింది. వివాదాస్పద సెన్‌కాకు ద్వీపసముదాయాన్ని జపాన్ భూభాగంగా చూపే శాశ్వత చట్టపరమైన మార్పులకు జపాన్ ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టింది. చైనా విభేదిస్తున్నప్పటికీ సెన్‌కాకు ద్వీపాల వరుస 1972 నుంచి జపాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. టోనొషిరో అనే ప్రాంతం పరిధిలోకి ఇవి వస్తాయి. అయితే తాజాగా ఇషికాగీ సిటీ కౌన్సిల్.. ఈ ప్రాంతం పేరును టోనిషిరో నుంచి టొనోషిరో సెన్‌కాకు‌గా మార్చేందుకు నిర్ణయించింది. ఇందు కోసం కొత్త బిల్లు కూడా ప్రేవేశపెట్టింది. ఇదే ప్రస్తుతం చైనాకు ఆగ్రహం కలిగిస్తోంది. సెన్‌కాకు ద్వీపాలను చైనా తన సహసిద్దమైన భూభాగంగా సంబోధిస్తుంటుంది. వీటిపై పూర్తి హక్కులు తమవేనని ఢంకా బజాయించి చెబుతుంటుంది. జపాన్ కూడా ఇదే రకమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ రెండు దేశాల వాదనలకు ఇప్పటి వరకూ ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదికా లేదు. కేవలం చారిత్రిక ఆధారాల ద్వారా మాత్రమే ఇరు దేశాలు ఆ ద్వీపాలపై అజమాయిషి కోసం ప్రయత్నిస్తున్నాయి. అయతే తాజాగా జపాన్ ప్రభుత్వం.. ఏకంగా సెన్‌కాకు ఉన్న ప్రాంతానికి పేరు మారుస్తూ ఈ ద్వీపాలపై చట్టపరమైన హక్కు జపాన్‌కు మాత్రమే ఉందని చెప్పకనే చెప్పింది. దీంతో చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. 

Updated Date - 2020-06-23T00:38:31+05:30 IST