మొత్తానికి స్పందించిన చైనా.. బైడెన్‌కు శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-11-13T23:47:06+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు ప్రపంచం మొత్తం అభినందనలు
బీజింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు ప్రపంచం మొత్తం అభినందనలు తెలిపినప్పటికీ చైనా, రష్యా, మెక్సికోలు ఇప్పటి వరకు మౌనం వహించాయి. చైనా మాత్రం తాజాగా మౌనం వీడింది. బైడెన్ విజయం సాధించిన వారం రోజుల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు పేర్కొంది. ‘‘అమెరికా ప్రజల తీర్పును మేం గౌరవిస్తున్నాం. బైడెన్, హారిస్‌లకు అభినందనలు తెలిపాం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రష్యా, మెక్సికోలు ఇప్పటికీ మౌనం వీడలేదు.
బైడెన్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఎలక్షన్ ఎక్విప్‌మెంట్ మేకర్ దేశవ్యాప్తంగా తనకు పోలైన 2.7 మిలియన్ ఓట్లను డిలీట్ చేశారంటూ గురువారం ట్రంప్ ఓ ట్వీట్‌లో ఆరోపించారు. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని యూఎస్ ఎన్నికల అధికారులు కొట్టిపడేశారు.
ట్రంప్ తన నాలుగేళ్ల పాలనలో చైనాను ఓ పెద్ద శత్రువుగానే పరిగణించారు. చైనా వల్ల ప్రపంచ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఉందని పదేపదే ఆరోపించారు. కొవిడ్-19 తర్వాత రెండు దేశాల మధ్య ఎడం మరింత పెరిగింది. కరోనా వైరస్‌ను చైనీస్ వైరస్‌గా అభివర్ణించారు. అంతేకాదు, అమెరికాలోని చైనీస్ టెక్ కంపెనీలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని, గూఢచర్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ వాటిపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజం హువావే విషయంలో కఠినంగా వ్యవహరించారు. చైనీస్ పేరెంట్ కంపెనీ బైడ్‌డ్యాన్స్‌కు చెందిన ‘టిక్‌టాక్’ను నిషేధించారు.
ఇప్పుడు అమెరికా పగ్గాలు బైడెన్ చేపట్టనుండడంతో దెబ్బతిన్న సంబంధాలు తిరిగి మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఫిబ్రవరిలో జరిగిన ప్రైమరీ డిబేట్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను బైడెన్ దొంగగా అభివర్ణించారు. అలాగే, చైనాలోని జింజియాంగ్‌లో ఉయ్‌ఘుర్ మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు.