ఐరాస భద్రతా మండలిలో చైనా పైచేయి... కోవిడ్-19పై చర్చకు ససేమిరా...
ABN , First Publish Date - 2020-03-27T22:09:04+05:30 IST
ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో చైనా ఆధిపత్యం మరోసారి బయటపడింది. కోవిడ్-19 మహమ్మారిపై చర్చ జరగకుండా నిలువరించడంలో పై
న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో చైనా ఆధిపత్యం మరోసారి బయటపడింది. కోవిడ్-19 మహమ్మారిపై చర్చ జరగకుండా నిలువరించడంలో పై చేయి సాధించింది. ఇందుకు తన వ్యాపార మిత్ర దేశాలైన రష్యా, దక్షిణాఫ్రికాల సహకారం తీసుకుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారిపై భద్రతా మండలిలో చర్చించాలని ఈస్టోనియా చేసిన ప్రతిపాదనకు మద్దతు లభించకుండా చేయడంలో చైనా విజయం సాధించింది.
కోవిడ్-19 మహమ్మారిపై పారదర్శకత అవసరమని ఈస్టోనియా వాదించింది. ప్రాణ నష్టం జరుగుతుండటంతో ప్రపంచ శాంతిభద్రతలకు విఘాటం కలుగుతోందని పేర్కొంది. అయితే భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ ఈ మహమ్మారి బారినపడటంతో ఈ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోలేదు.
కరోనా వైరస్ వ్యాప్తికి, ప్రపంచ శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లడానికి ప్రత్యక్ష సంబంధం లేదని రష్యా, దక్షిణాఫ్రికా వాదించినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ రెండు దేశాలు చైనాకు వ్యాపార భాగస్వాములు కావడం గమనార్హం. ఏదైనా ప్రతిపాదనపై చర్చ జరగాలంటే, నిబంధనల ప్రకారం ఏకాభిప్రాయం తప్పనిసరి అని చైనా పేర్కొంది. ఈస్టోనియా చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు భద్రతా మండలిలోని సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని, అందువల్ల చర్చ సాధ్యం కాదని పేర్కొంది.
కరోనా వైరస్ చైనాలోనే మొదట కనిపించిందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో చైనా ఉంటుంది. ఆ తర్వాత డొమినికన్ రిపబ్లిక్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.
ఐరాస భద్రతా మండలి ప్రపంచ శాంతిభద్రతలపై దృష్టి సారిస్తుంది. గతంలో కూడా ఎబోలా వంటి మహమ్మారులపై చర్చించింది. తాజాగా కోవిడ్-19పై చైనా గురించి మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మినహా మిగతా దేశాధినేతలు సాహసించడం లేదు. దీనికి కారణం గత మూడు నెలల్లో చైనా ఈ మహమ్మారి చికిత్సకు అవసరమయ్యేవాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా పెంచుకోవడమే. వెంటిలేటర్లు, హజ్మత్ సూట్లు, మాస్క్‌లు, ఇతర పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చైనా పెంచుకుంది. వీటిని తాము దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు రావచ్చుననే ఉద్దేశంతో అన్ని దేశాలు మౌనంగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.