పంజాబీ పాటలతో చైనా కుటిల యుద్ధతంత్రం

ABN , First Publish Date - 2020-09-17T00:56:12+05:30 IST

యుద్ధ చేయకుండా ప్రత్యర్థుల మానసిక స్థైర్యం దెబ్బతీయడం ఎలా?. ఎప్పుడో ..

పంజాబీ పాటలతో చైనా కుటిల యుద్ధతంత్రం

న్యూఢిల్లీ: యుద్ధ చేయకుండా ప్రత్యర్థుల మానసిక స్థైర్యం దెబ్బతీయడం ఎలా?. ఎప్పుడో 6వ శతాబ్దంలో చైనా మిలటరీ వ్యూహకర్త సున్ సూ రాసిన 'యుద్ధకళ' పుస్తకంలోని పాత టెక్నిక్‌నే చైనా ఇప్పటికీ అనుసరిస్తోంది. లద్దాఖ్‌లో మోహరించిన భారత బలగాల మనోస్థైర్యం దెబ్బతీసేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక ఇవే మానసిక అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి.


ఆగస్టు 29-30 రాత్రి ప్యాంగాగ్ త్సూ ప్రాంతంలో చైనా దళాల దాడిని భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టి ఫింగర్ 4పై తమ తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి. కీలక ప్రాంతాలను హస్తగతం చేసుకున్నాయి. తమ యత్నం బెడిసికొట్టడంతో పీఎల్ఏ తొలుత ట్యాంకులు, దళాలతో విరుచుకుపడేందుకు కసరత్తు చేసింది. చైనా ఎత్తుగడలను పసిగట్టిన భారత సైన్య ఏమాత్రం వెనుకంజ వేయకుడా "రెడ్ లైన్' అతిక్రమిస్తే ప్రతిదాడులు తప్పవంటూ ప్రకటించడంతో డ్రాగెన్ వెనక్కి తగ్గింది. మళ్లీ వ్యూహం మార్చింది. ఎప్పుడో పాతబడిన 1962 యుద్ధ తంత్రాన్నే పీఎల్ఏ మళ్లీ తెరపైకి తెచ్చింది.


పాత పాటలే...

భారత గస్తీని కీలక పర్వత ప్రాంతాల్లో నిలువరించేందుకు పంజాబీ పాటలను పీఎల్ఏ ఎంచుకుంది. ఫింగర్‌ 4 వద్ద లౌడ్‌స్పీకర్లలో పంజాబీ పాటలు, ప్యాంగాంగ్‌ త్సో దక్షిణ తీరంలో హిందీలో భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది. ఢిల్లీలోని రాజకీయ పెద్దలు తమ అభీష్టానికి అనుగుణంగా సైనికులకు శీతాకాలంలో ప్రతికూల వాతావరణంలో మోహరించారని, గడ్డకట్టే చలి వాతావరణంలో వేడి భోజనం, రవాణా సౌకర్యాలు లేవని, రాబోయే శీతాకాలంలో మరిన్ని గడ్డు పరిస్థితులు చవిచూడాల్సి ఉంటుందని రెచ్చగొడుతోంది.


మరోవైపు, చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక సైతం భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టిన విషయాన్ని ప్రస్తావించకుండానే, భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం లద్దాఖ్‌పై కఠిన వైఖరి అవలంభిస్తోందని ఇష్టమొచ్చిన రాతలు రాసింది.

Updated Date - 2020-09-17T00:56:12+05:30 IST