శత్రుత్వ బీజాలు నాటడం ఆపండి : చైనా

ABN , First Publish Date - 2020-10-27T23:35:17+05:30 IST

భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండటంతో చైనా ఉక్కిరిబిక్కిరి

శత్రుత్వ బీజాలు నాటడం ఆపండి : చైనా

బీజింగ్ : భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండటంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) సెగ బాగా తగిలింది. దీంతో తనకు, ఇతర దేశాలకు మధ్య శత్రుత్వ బీజాలను అమెరికా నాటుతోందని ఆరోపించింది. ఈ ప్రాంతంలోని దేశాలతో తనకు విరోధం సృష్టించడం ఆపాలని గట్టిగా కోరింది. 


2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ డయలాగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో, అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పర్ మంగళవారం పాల్గొన్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పటిష్టపరచుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 


ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి వాంగ్ వెన్‌బిన్‌ స్పందనను మీడియా కోరింది. వాంగ్ మాట్లాడుతూ భారత దేశం పేరును ప్రస్తావించలేదు. కానీ చైనా నుంచి ముప్పు ఉందని పొంపియో స్పష్టంగా పేర్కొనడంపై స్పందించారు. చైనా వ్యతిరేక ప్రకటనలు చేయడంపై మండిపడ్డారు. పొంపియో చైనాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం కొత్త విషయం కాదన్నారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని చెప్పారు. పొంపియో ప్రచ్ఛన్న యుద్ధ మానసిక స్థితికి, సైద్ధాంతిక పక్షపాతానికి  అంటిపెట్టుకుని ఉన్నారని దుయ్యబట్టారు. కోల్డ్ వార్, జీరో-సమ్ గేమ్ మెంటాలిటీలను వదిలిపెట్టాలని ఆయనను కోరుతున్నామన్నారు. చైనా, ప్రాంతీయ దేశాల మధ్య శత్రుత్వ బీజాలను నాటడం ఆపాలని, అదేవిధంగా ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్పించవద్దని కోరుతున్నామన్నారు. 


Updated Date - 2020-10-27T23:35:17+05:30 IST