చైనాపై విమర్శల డోసు పెంచిన భారత్!
ABN , First Publish Date - 2020-06-26T01:55:11+05:30 IST
మీదే తప్పు అంటూ పిడివాదానికి దిగుతున్న చైనాపై భారత్ గురువారం నాడు విమర్శల డోసు పెంచింది.

న్యూఢిల్లీ: మీదే తప్పు అంటూ పిడివాదానికి దిగుతున్న చైనాపై భారత్ గురువారం నాడు విమర్శల డోసు పెంచింది. మే నెల నుంచీ కొనసాగుతున్న గాల్వాన్ ఉద్రిక్తతకు చైనాయే బాధ్యత వహించాలని విస్పష్ట ప్రకటన చేసింది. అన్ని అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కుతూ చైనా వేగంగా సైనిక బలగాలను అక్కడ మోహరిస్తోందని మండిపడింది.
‘మే నెల నుంచీ చైనా సరిహద్దు వెంబడి భారీగా బలగాలను మోహరిస్తోంది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలకూ పూర్తిగా విరుద్ధం’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సూటిగా ప్రకటించారు. ఎప్పటి నుంచో భారత బలగాలు గల్వాన్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నాయని, కానీ ఏఒక్క సందర్భంలోనూ వాస్తవ స్థితిని మార్చేందుకు ప్రయత్నించలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
గల్వాన్ లోయ భారత్‌దే అనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయని కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కాదు..ఆ లోయ మాదే అంటూ చైనా ఇటీవల చేస్తున్న ప్రకటనలు వాస్తవం కావని, ఆ ప్రాంతంపై గతంలో చైనా చేసిన ప్రకటనలకు ఇవి పూర్తి విరుద్ధమని కూడా ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు.. తాము కూడా సైనికులు కోల్పోయామని చైనా నిన్న తొలిసారిగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తమ నష్టం అంత ఎక్కువగా ఏమీ లేదని బుకాయించే ప్రయత్నం చేసింది. అక్కడితో ఆగక భారత్ మీడియాలో చైనాకు సంబంధించి అవాస్తవాలు ప్రచురితమవుతున్నాయని తెలిపింది. భారత్ కంటే చైనా నష్టం రెండింతలు ఉండొచ్చంటూ కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటనను కూడా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు.