భారత్‌లో పెరుగుతున్న బాల్యవివాహాలు.. కరోనానే కారణం..!
ABN , First Publish Date - 2020-10-03T17:27:21+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతున్న దురాచారం బాల్యవివాహం. కరోనా నేపథ్యంలో ఈ తరహా వివాహాల సంఖ్య మరింత పెరగనుంది. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 25 లక్షల మంది బాలికలు బాల్యవివాహాలకు బలయ్యే...

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతున్న దురాచారం బాల్యవివాహం. కరోనా నేపథ్యంలో ఈ తరహా వివాహాల సంఖ్య మరింత పెరగనుంది. ఐక్యరాజ్య సమితితో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనాల్లో ఈ ఆందోళనకర విషయం వెల్లడైంది. భారత్‌లోనూ ఈ దురాచారానికి ప్రతి ఏటా లక్షల మంది ఈ దురాచారానికి బలవుతున్నారు.
కరోనా నేపథ్యంలో బాల్య వివాహాల సంఖ్య మరింత పెరగనుంది. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 25 లక్షల మంది బాలికలు బాల్యవివాహాలకు బలయ్యే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితితో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనాల్లో ఈ ఆందోళనకర విషయం వెల్లడైంది. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్‌లో కూడా ఈ బాల్యవివాహాలు పెరుగుతుండడం శోచనీయం.
కరోనా వల్ల మన దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. దీనివల్ల ఆయా కుటుంబాల్లో ఉన్న బాలికలను చదివించడం కష్టతరమవుతోంది. ఆ చిన్నారులు కుటుంబానికి భారంగా మారుతున్నారు. ఈ తరుణంలో ఆ బరువును ఎలాగైనా దించుకోవాలని కుటుంబం భావిస్తోంది. దీంతో చదువుకోవాల్సిన వయసులోనే బాలికలు చిన్నారి పెళ్లి కూతుళ్లుగా మారుతున్నారు. వివాహం తెలియని అమ్మాయిలు తల్లిదండ్రుల బలవంతంతో పెళ్లి పీటలెక్కుతున్నారు. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో తల్లులవుతున్నారు. దీనివల్ల శారీరకంగానే కాక మానసికంగా కూడా వారిపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది.
బాలికలకు ఇన్నాళ్లూ స్కూళ్లు, కాలేజీలు ఓ రక్షణ కవచంలా పనిచేశాయి. ప్రతి రోజూ స్కూలుకు వెళుతూ చదువుకుంటుండడంతో తల్లిదండ్రులు కూడా 'బిడ్డ చదువుకుంటోందిలే..!' అని సరిపెట్టుకునే వారు. కానీ కరోనా వల్ల గత 6 నెలలుగా పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకపక్క కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడం.. మరో పక్క ప్రతి క్షణం కూతురు కళ్లముందు ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆమె భారంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. ఏమో.. అనే ఆందోళనలో చిన్న వయసులోనే తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కరోనా లాక్‌డౌన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే 5వేలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చైల్డ్ లైన్ హెల్ప్ సెంటర్ తెలిపింది. అయితే ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన సంఘటలు మాత్రేమనని, దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో బాల్యవివాహాలు జరుగుతున్నాయని, సమాచారలేమి కారణంగా వాటిని నిరోధించడం అసాధ్యమవుతోందని చెప్పుకొచ్చింది.
ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక బాల్యవివాహాలపై సంచలన విషయాలను వెల్లడించింది. రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు కోటి 30 లక్షల మంది బాలికలు చిన్నారి పెళ్లి కూతుళ్లుగా మారనున్నారని, దీనికి కరోనా మహమ్మారే ప్రధాన కారణమని పేర్కొంది. 2019 యునిసెఫ్ లెక్కల ప్రకారం భారత్‌లో ఇప్పటికే 2కోట్ల 30 లక్షల వరకు బాల్యవివాహాలు జరిగాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా నమోదైన బాల్యవివాహాల్లో మూడో వంతుకు సమానం. ప్రతి ఏటా 27 శాతం మంది భారతీయ బాలికలు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి పీటలెక్కుతున్నారు. వీరి సంఖ్య 15 లక్షలకు వరకు ఉంటుంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే దాదాపు 7 శాతం మంది చిన్నారులు ఏకంగా 15 ఏళ్లుకూడా నిండకుండానే తాళి కట్టించుకుంటున్నారు.
సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో దాదాపు 5లక్షల మంది బాలికలు బాల్యవివాహాలకు బలయ్యే ప్రమాదం ఉందట. అంతేకాదు బాల్యవివాహాలు చేసుకున్న మరో 10 లక్షల మంది గర్భవతులు కూడా కానున్నారట. ఈ సంఖ్య ప్రతీ ఏడాది 3% నుంచి 4% వరకు పెరుగుతుంతోందంటూ సేవ్ ద చిల్డ్రన్ ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా నేపథ్యంలో అత్యధికంగా బాల్యవివాహాలు జరగనున్న ప్రాంతాల్లో ఆఫ్రికా ప్రథమ స్థానంలో ఉంది. ఒక్క ఆఫ్రికాలోనే 90 వేల మంది బాలికలు బాల్య వివాహాలకు బలి కానున్నారు. తరువాతి స్థానంలో లాటిన్ అమెరికా-కరీబియన్ దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 74 వేల మంది బాలికలు పెళ్లి కూతుళ్లుగా మారనున్నారు. ఆ తరువాత తూర్పు ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో 61 వేలమంది, యూరప్-సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో దాదాపు 38 వేల మంది, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలలో దాదాపు 15 వేల మంది ఈ దురాచారానికి తల వంచనున్నారు.