చైనా చిలక కొత్త రామాయణం!

ABN , First Publish Date - 2020-07-15T06:48:05+05:30 IST

భారత్‌లో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్‌.. మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. కోట్లాది మంది భారతీయుల ఆరాధ్యదైవమైనశ్రీరాముడు అసలు భారతీయుడే కాదని.. నేపాలీ అని.. భారత్‌లో వివాదాస్పద అయోధ్య ఉంటే.. వాస్తవ అయోధ్య నేపాల్‌లో ఉందని...

చైనా చిలక కొత్త రామాయణం!

  • నేపాల్‌ ప్రధాని ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు
  • తెర వెనుక చైనా.. విశ్లేషకుల అంచనా!

భారత్‌లో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్‌.. మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. కోట్లాది మంది భారతీయుల ఆరాధ్యదైవమైనశ్రీరాముడు అసలు భారతీయుడే కాదని.. నేపాలీ అని.. భారత్‌లో వివాదాస్పద అయోధ్య ఉంటే.. వాస్తవ అయోధ్య నేపాల్‌లో ఉందని.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన  వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. కొన్నేళ్లుగా చైనాతో పెనవేసుకున్న నేపాల్‌, గతఏడాది నుంచి ఏదోక విధంగా భారత్‌ను కవ్విస్తోంది. ఓలి చేసిన తాజా వ్యాఖ్యలు కాకతాళీయంగా చేసిన కావని.. భారత్‌ను ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గొం తుక మాత్రమే ఓలిదని, మాటలన్నీ చైనావేనని చెబుతున్నారు. భారతీయ, నేపాలీ హిందువులిద్దరికీ శ్రీరాముడు ఆరాధ్యదైవమే! ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్నట్లే..నేపాల్‌లో కూడా ఒక అయోధ్య ఉంది. బీహార్‌లో ఉన్నట్లే అక్కడ కూడా ఒక వాల్మీకి ఆశ్రమం ఉంది. సీత జన్మస్థలం నేపాల్‌లోని జనకపురి అని చాలా మంది హిందువుల విశ్వాసం. ‘‘రాముడు నేపాలీ.. భారతీయుడు కాదు. రాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని తోరిలో ఉంది.  కొన్ని వందల ఏళ్లుగా నేపాల్‌ సాంస్కృతిక దాడికి గురవుతోంది. నేపాల్‌ చరిత్రను వక్రీకరిస్తున్నారు’’ అని ఓలి సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో  వ్యాఖ్యానించారు. అంతే కాకుండా శ్రీరాముడి తండ్రి దశరథుడు నేపాల్‌ను పాలించాడని చెప్పారు. ‘‘దశరథుడు నేపాల్‌ను పాలించాడు. అందువల్ల ఆయన కుమారుడైన రాముడు నేపాలీ ఎందుకు కాదు? జనకపురికి వచ్చి సీతను  రాముడు పెళ్లి చేసుకున్నాడు. జనకపురికి సమీపంలోని బీర్‌కుంజ్‌ వద్ద అయోధ్య ఉంది. ఒక వేళ ఈ అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో ఉండి ఉంటే, సుదూరమైన నేపా ల్‌ వచ్చి సీతను వివాహమాడేవాడా?’’ అని ఓలి ప్రశ్నించా రు. భారత్‌లోని అయోధ్య వివాదాస్పద ప్రాంతమని.. నేపాల్‌లోని అయోధ్యకు అలాంటివేమీ లేవని చెప్పారు.


తెర వెనుక చైనా?

నేపాల్‌ను దగ్గర చేసుకోవడానికి చైనా దాదాపు రెండు, మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. ఆర్థిక సహాయం పేరిట కొన్ని నిధులనూ ముట్టచెబుతోంది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకూ తోడ్పడుతోంది. ముఖ్యంగా  భారతదేశంతో ఉన్న 1,751 కిలోమీటర్ల సరిహద్దుల చుట్టూ ఉన్న ప్రాంతాలపై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన ఒక మ్యాప్‌లో లిపులేఖ్‌, కాలాపాని, లింపియాదురా అనే మూడు ప్రాంతాలు తమవిగా నేపాల్‌ పేర్కొంది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 


ఓలి ఎందుకిలా?

నేపాల్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి.. ఓలి పార్టీకి మధ్య విభేదాలున్నాయి. ఓలి పని తీరుపై నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నేత ప్రచండ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక భారత్‌ ప్రమేయముందనేది ఓలి భావన. దీంతో చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భారత వ్యతిరేక భావాలను ఓలి రెచ్చగొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాముడిపై ఓలి చేసిన వ్యాఖ్యలు మోదీ సర్కారును రెచ్చగొట్టడానికేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

రాముడిపై వ్యాఖ్యలు చేయడానికి నేపాల్‌ కవి భానుభక్త జయంతిని ఓలి ఎంచుకున్నారు. 1814లో జన్మించి, 1868లో మరణించిన భానుభక్త వాల్మీకి.. రామాయణాన్ని సంస్కృతం నుంచి నేపాలీ భాషలోకి అనువదించారు. ఇప్పటికీ నేపాల్‌లో ఆ రామాయణాన్నే ఎక్కువ మంది చదువుతూంటారు. 

- స్పెషల్‌ డెస్క్

Updated Date - 2020-07-15T06:48:05+05:30 IST