అధిష్టానం చెబితే రాజీనామాకు సిద్ధం: చత్తీస్‌గఢ్ సీఎం

ABN , First Publish Date - 2020-12-12T04:21:40+05:30 IST

తన పదవీకాలం పూర్తైందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ స్పందించారు. అధిష్టానం తనను...

అధిష్టానం చెబితే రాజీనామాకు సిద్ధం: చత్తీస్‌గఢ్ సీఎం

రాయ్‌పూర్: తన పదవీకాలం పూర్తైందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ స్పందించారు. అధిష్టానం తనను రాజీనామా చేయమని ఆదేశించిన పక్షంలో.. తక్షణం రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి రెండున్నరేళ్ల ఫార్ములా ఉందనీ.. పదవీకాలం పూర్తైనందున బాఘెల్ రాజీనామా చేస్తారంటూ ఇవాళ మీడియాలోని ఓ వర్గం వార్తలు ప్రసారం చేసింది. వచ్చే వారానికి ఆయన సీఎం పదవి చేపట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత చేకూరింది. దీంతో ఈ ‘‘ఫార్ములా’’ గురించి తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ... ‘‘రాజీనామా చేయాలంటూ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తే, వెంటనే నేను పదవిలో నుంచి దిగిపోతాను. అధిష్టానం సూచనల మేరకే నేను బాధ్యతలు చేపట్టాను. ఒకవేళ పార్టీ నేతలు నన్ను రాజీనామా చేయమని అడిగితే.. నేను వెంటనే పదవి నుంచి దిగిపోతాను...’’ అని పేర్కొన్నారు. 2018 డిసెంబర్లో బాఘెల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇదే పదవి కోసం మరికొందరు పోటీపడడంతో.. కాంగ్రెస్ అధిష్టానం రెండున్నరేళ్ల ఫార్ములా అమలు చేస్తోందంటూ అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి.

Updated Date - 2020-12-12T04:21:40+05:30 IST