అమ్మో.. శశిథరూర్ ట్వీట్ అర్థం చేసుకోవడం కష్టమే సుమీ!

ABN , First Publish Date - 2020-09-14T06:29:55+05:30 IST

భారతదేశంలో ఆంగ్ల భాషపై ఎక్కువ పట్టు ఉన్న వ్యక్తుల్లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా

అమ్మో.. శశిథరూర్ ట్వీట్ అర్థం చేసుకోవడం కష్టమే సుమీ!

న్యూఢిల్లీ: భారతదేశంలో ఆంగ్ల భాషపై ఎక్కువ పట్టు ఉన్న వ్యక్తుల్లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఒకరు. 20 పుస్తకాల వరకు రాసిన ఆయన ఆంగ్ల భాషను ఓ ఆటాడుకుంటారు. శశిథరూర్ అందరిలా కాకుండా తన స్పీచ్‌లలో వినూత్నమైన ఆంగ్ల పదాలను వాడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ రచయిత చేతన్ భగత్ భారతీయ యువతకు సంబంధించి ఓ వ్యాసం రాసుకొచ్చారు. భారతీయ యువత ఫోన్లకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నించాలని వ్యాసంలో చెప్పుకొచ్చారు. చేతన్ భగత్ భారతీయులందరూ ఏం చేయాలో తన వ్యాసంలో సూపర్‌గా చెప్పారంటూ శశిథరూర్ ఆయనను కొనియాడుతూ ఓ ట్వీట్ పెట్టారు.


ఈ ట్వీట్‌పై చేతన్ భగత్ స్పందిస్తూ.. ‘సార్.. మీరు నన్ను పొగిడారని తెలిసిన నాటి నుంచి గాల్లో తేలుతున్నా.. అయితే నాదో చిన్న విన్నపం.. భవిష్యత్తులో నన్ను పొగిడేటప్పుడు మీరు ఎప్పుడూ వాడే వినూత్నమైన పదాలతో పొగడండి సార్. సూపర్బ్(అద్భుతం) అనే పదం మీరు ఉపయోగించడం బాగానే ఉంది.. కానీ ఈసారి దానికంటే పెద్ద పదం వాడండి సార్’ అని చేతన్ భగత్ శశిథరూర్‌ను కోరారు. ఇక చేతన్ భగత్ కోరిక మేరకు శశిథరూర్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన అనేక వినూత్నమైన ఆంగ్ల పదాలను వాడుతూ చేతన్ భగత్ రాసిన వ్యాసాన్ని, ఆయన ఐడియాలను మెచ్చుకున్నారు. ఈ పదాలను చూసిన నెటిజన్లు వాటి అర్థం డిక్షనరీలో అయినా దొరుకుతుందో లేదో అని కామెంట్లు పెడుతున్నారు.   


Updated Date - 2020-09-14T06:29:55+05:30 IST