మందు కనిపెట్టి తనమీదే ప్రయోగించుకున్న ఫార్మాసిస్ట్.. కొద్దిసేపటికే..

ABN , First Publish Date - 2020-05-08T21:58:06+05:30 IST

జలుబును తగ్గించే ఓ మందును కనిపెట్టి తనమీదే ప్రయోగించుకున్న ఓ ఫార్మాసిస్ట్... అది వేసుకున్న కొద్ది సేపటికే ..

మందు కనిపెట్టి తనమీదే ప్రయోగించుకున్న ఫార్మాసిస్ట్.. కొద్దిసేపటికే..

చెన్నై: జలుబు కోసం కొత్త మందును కనిపెట్టి తనమీదే ప్రయోగించుకున్న ఓ ఫార్మాసిస్ట్... అది వేసుకున్న కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయిన వైనమిది. గురువారం రాత్రి చెన్నైలోని తైనంపేట్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ వైద్యుడి ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో... ఫార్మసిస్ట్‌తో పాటు ఈ డ్రగ్ తయారీలో వైద్యుడి పాత్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెరుంగుడికి చెందిన శివనేసన్ అనే వ్యక్తి చెన్నై రాకముందు ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రయివేటు బయోటెక్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. అనంతరం కొడంబాక్కంలోని భూపతినగర్‌లో అదే కంపెనీకి చెందిన ఓ ల్యాబ్‌లో పనిచేశాడు.


‘‘ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయిన శివనేసన్ జలుబు తగ్గించే కొత్త డ్రగ్ కోసం గత రెండు నెలలుగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ఆ డ్రగ్‌ను తీసుకుని డాక్టర్ రాజ్‌కుమార్ నివాసానికి వచ్చాడు. రాజ్‌కుమార్ ఆ మందులో కొద్ది భాగం మాత్రమే వేసుకోగా.. శివనేసన్ మరింత మింగడంతో అప్పటికప్పుడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు..’’ అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. మృతుడు సోడియం నైట్రేట్ వేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.  అయితే ఆయన ఎలా మరణించారన్నది కేవలం పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-08T21:58:06+05:30 IST