చైనాకు చెక్
ABN , First Publish Date - 2020-10-27T07:02:14+05:30 IST
నానాటికీ చెలరేగిపోతూ అన్నిటా ఘర్షణకు దిగుతున్న చైనాకు కళ్లెం వేసే ఏకైక లక్ష్యంతో భారత్, అమెరికా మంగళవారం ఓ

నేడు భారత్ - అమెరికా కీలక రక్షణ ఒప్పందం
2+2 చర్చల అనంతరం ‘బెకా’పై సంతకాలు
సైనిక సమాచారం రియల్‌టైంలో భారత్‌కు!
విదేశాంగ, రక్షణ మంత్రుల సన్నాహక చర్చలు
డ్రాగన్ తీరును వివరించిన భారత్
చైనాతో ప్రపంచానికి ముప్పన్న అమెరికా
న్యూఢిల్లీ, అక్టోబరు 26: నానాటికీ చెలరేగిపోతూ అన్నిటా ఘర్షణకు దిగుతున్న చైనాకు కళ్లెం వేసే ఏకైక లక్ష్యంతో భారత్, అమెరికా మంగళవారం ఓ అత్యంత కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాయి. దీని పేరు: బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)... స్థూలంగా చెప్పాలంటే భౌగోళిక- అంతరిక్ష సమాచారాన్ని అందజేసుకునే ఒప్పందం.
అమెరికా సైనిక ఉపగ్రహాలు పంపే సూక్ష్మస్థాయి, కచ్చితమైన స్థల-సంబంధ డేటా, వాటికి సం బంధించిన రేఖా చిత్రాలను, వీడియోలను, ఇతర మ్యాప్‌లను భారత్ నేరుగా పొందేందుకు వీలు కల్పించే ఒప్పందమిది. ఉదాహరణకు లద్దాఖ్‌లో చైనా దళాలు ఎక్కడెక్కడ ఎంతమేర విస్తరించి ఉన్నాయి, ట్యాంకులు, యుద్ధసామగ్రి ఎంత దూరం లో ఉంది.. మొదలైన వాటిని అమెరికన్ ఉపగ్రహాలు రియల్ టైమ్‌లో భారత్‌కు పంపిస్తాయి. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం అందజేసుకునే ఈ రక్షణ బంధం ఇరుదేశాల సంబంధాల్లో ఓ మైలురాయు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని అంశాలనూ ఇరుదేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మార్క్ ఎస్పర్ సోమవారం సమీక్షించారు. రెండు దేశాలమధ్య మంగళవారం జరిగే కీలకమైన 2+2 చర్చల్లో ఈ బెకా ఒప్పందంపై వీరివురూ సం తకం చేస్తారు. 2+2 చర్చల నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో కలిసి మార్క్ ఎస్పర్ సోమవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో పెరగాల్సిన సహకారం, సైనిక బలగాల మధ్య పెంపొందాల్సిన సంబంధాలపై ఇద్దరు మంత్రులూ చర్చించారు.
ఈ చర్చల్లో అగ్రశ్రేణి రక్షణరంగ ప్రముఖులు.. మహా దళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు, డీఆర్డీవో చీఫ్, రక్షణమంత్రి సలహాదారు జి.సతీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అమెరికా తరఫున త్రివిధ దళాల ఉన్నతస్థాయి అధికారులు, రక్షణ సహకార సం స్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమయంలోనే విదేశాంగ మంత్రులు ఎస్.జయశంకర్, మైక్ పాంపియో విడిగా సమావేశమై ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో సహకారం, దౌత్య, ఇతర అం శాలపై చర్చించారు.
మంగళవారం నాటి 2+2 చర్చలకు ఇవి సన్నాహక సమావేశాలు. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇద్దరు అమెరికా అగ్రశ్రేణి మంత్రులు చర్చలకు రావడ మే కీలక పరిణామంగా చెబుతున్నారు. చర్చల సమయంలో చైనా వైఖరిని ఎస్పర్‌కు రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. లద్దాఖ్ లో ఎంతమేర చొచ్చుకొచ్చినదీ, ఎల్ఏసీని మార్చడానికి చేస్తు న్న యత్నాలు, టిబెట్-తైవాన్‌లపై ఒత్తిడి.. అన్నింటినీ విశదపరిచారు. పాక్‌తో సాగిస్తున్న దుర్నీతిని ఎండగట్టారు. చైనా ప్రపంచానికే ముప్పుగా మారిందని అమెరికా బృందం అభిప్రాయపడ్డట్లు సమాచారం.
బెకాతో ప్రయోజనం..?
హిమాలయ పర్వత ప్రాంతా ల్లో శత్రుదేశ కదలికలకు సంబంధించి నిర్ధిష్ట సమాచారం పొందే అవకాశం ఇన్నాళ్లూ భారత్‌కు లేదు. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లాంటి 14 వేల అడుగుల ఎత్తున ఉన్న యుద్ధక్షేత్రంలో సైనిక మోహరింపులను వెంటనే తెలుసుకునే వీలుండేది కాదు. స్థానిక ప్రజల ద్వారానో, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానో కాస్త సమాచారం లభించేది. ఇకపై ఉపగ్రహ సమాచారం ద్వారా శత్రు కదలికలను ముందే పసిగట్టి రక్షణ చర్యలను భారత్ తీసుకోవచ్చు.
చైనా గానీ, పాక్ గానీ చొచ్చుకొచ్చే లోపే వాటిని నిరోధించే వ్యూహాలతో రంగంలోకి దిగొచ్చు. అమెరికా వివిధ దేశాలపై జరుపుతున్న వైమానిక దాడులకు ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వీడియోలే ఆధా రం. భారత ఉపఖండంలో తనకు విశ్వాసపాత్రమైన మిత్ర దేశంగా మసలుతున్న భారత్‌తో బంధం పెంచుకొనేందుకు అమెరికా ఈ రహస్య సమాచారాన్ని అందజేసేందుకు అంగీకరించింది. చైనాను వదిలిపెట్టేది లేదంటూ ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్న అమెరికా ప్రయత్నాల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఒకటి.
ఇంతకుమునుపే లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ ఒప్పందం(లెమోవా), కమ్యూనికేషన్స్-కంపాటబిలిటీ సహకార ఒప్పందం(కోమ్‌కాసా)పై సంతకాలు చేసిన ఇరుదేశాలూ ఇపుడు బెకాతో మూడు వ్యూహాత్మక భాగస్వామ్య అగ్రిమెంట్లను కుదుర్చుకున్నట్లవుతుంది. లద్దాఖ్‌లో కయ్యానికి దిగి, ఎల్ఏసీని మార్చాలన్న కుట్ర, అరుణాచల్నూ కబళించాలని ప్రయత్నిస్తున్న చైనా వైఖరితో భారత్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇండో ఫసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల ఒప్పందాలను కాలరాస్తోందని, ప్రపంచానికే ముప్పుగా మారిందని భావిస్తున్న అమెరికాతో జట్టు కట్టింది. ప్రపంచ దేశాలన్నీ కలసి చైనాను ఎదుర్కొనాలన్న అమెరికా అభిప్రాయంతో భారత్ ఏకీభవిస్తోంది. అందుకే 2+2 చర్చలకు విశేష ప్రాధాన్యం.
మలబార్ తీరంలో వచ్చే నెలలో జరిగే సైనిక విన్యాసాలకు ఆస్ట్రేలియాను కూడా భారత్ చేర్చడంపై అమెరికా హర్షం ప్రకటించింది. ఇప్పటికే నాలుగు ఇండో-ఫసిఫిక్ దేశాల కూటమి (క్వాడ్) ద్వారా భారత్, జపాన్, ఆస్ట్రేలియాలకు చేరువైన అమెరికా ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలతో చైనాను నలువైపుల నుంచీ కట్టడి చేసేందుకు కార్యాచరణను సాగిస్తోంది. భారత్ లక్ష్యమూ డ్రాగన్‌కు ముకుతాడు వేయడమే. అందుకే చైనా పేరెత్తకుండా చకచకా ఒప్పందాలను కుదుర్చుకొంటోంది.
