ఈ దశాబ్దం ‘భారత్’ దే కావాలి... అందుకే ఈ సంస్కరణలు : మోదీ

ABN , First Publish Date - 2020-10-19T19:52:53+05:30 IST

ఈ దశాబ్దం ‘భారత దశాబ్దం’ గా మార్చడానికే అన్ని రంగాల్లో అత్యవసర సంస్కరణలను చేపట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఈ దశాబ్దం ‘భారత్’ దే కావాలి... అందుకే ఈ సంస్కరణలు : మోదీ

న్యూఢిల్లీ : ఈ దశాబ్దం ‘భారత దశాబ్దం’ గా మార్చడానికే అన్ని రంగాల్లో అత్యవసర సంస్కరణలను చేపట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గత 6,7 నెలలుగా అన్ని రంగాల్లో త్వరిత గతిన సంస్కరణలను చేపట్టిన విషయాన్ని ప్రజలు గమనించే ఉంటారని ఆయన తెలిపారు. మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మికం.... ఇలా ప్రతి రంగంలోనూ వేగంగా సంస్కరణలు చేపట్టామని, ఇవన్నీ దేశంలోని యువతను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని ఆయన తెలిపారు.


‘‘ఈ దశాబ్దం మన భారత్‌దే కావాలి. పునాదులను పటిష్ఠం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది.’’ అని ప్రధాని ప్రకటించారు. దేశంలో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలాంటి సంస్కరణలు జరగలేదని, ఓ నిర్ణయం తీసుకుంటే ఒక రంగానికి మాత్రమే ప్రయోజనం జరిగేదని, ఇతరులు వెనకబడిపోయేవారని అన్నారు. ఇప్పుడు మాత్రం అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టామని ఆయన తెలిపారు. నూతనంగా రూపొందించిన విద్యా విధానం దేశంలో సమూల మార్పులు తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో సామర్థ్యాన్ని, పోటీ తత్వాన్ని పెంచే విషయంతో పాటు బహుముఖీన రంగాల్లో దృష్టి సారించే అవకాశం ఈ విద్యా విధానంతో సాధ్యమవుతుందన్నారు. కేవలం కొత్త సంస్థలను ప్రారంభించడానికే ఉన్నత విద్యలో కొత్త సంస్కరణలు తేవడం లేదని, పాలన పరంగా, జెండర్ పరంగా, సామాజికంగా కూడా మార్పులు తేవడానికి అని మోదీ తెలిపారు. 

Updated Date - 2020-10-19T19:52:53+05:30 IST