చైనాకు సవాల్ విసురుతూ, మలబార్ నావికా దళ విన్యాసాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-04T00:09:47+05:30 IST
విస్తరణవాదంతో చెలరేగిపోతున్న చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి.
న్యూఢిల్లీ : విస్తరణవాదంతో చెలరేగిపోతున్న చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. భారీ మలబార్ నావికా దళ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనాను దీటుగా ఎదుర్కొంటామని చాటి చెప్పాయి. మంగళవారం ప్రారంభమైన తొలి దశ విన్యాసాలు ఈ నెల 6 వరకు జరుగుతాయి.
భారత దేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను క్వాడ్ దేశాలు అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు దేశాల నావికా దళాలు మంగళవారం నుంచి మెగా మలబార్ నావల్ ఎక్సర్‌సైజెస్‌ను ప్రారంభించాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం పదమూడేళ్ళలో ఇదే తొలిసారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈ నెల 6 వరకు తొలి దశ విన్యాసాలు జరుగుతాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత దేశానికి చెందిన ఓ జలాంతర్గామితోపాటు 5 నౌకలు, అమెరికాకు చెందిన జాన్ ఎస్ మెక్‌కెయిన్ మిసైల్ డిస్ట్రాయర్, ఆస్ట్రేలియాకు చెందిన బలరత్ ఫ్రిగేట్, జపనీస్ డిస్ట్రాయర్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య నేరుగా సంబంధాలు ఉండవు.
గుర్రుగా ఉన్న చైనా
మలబార్ విన్యాసాల లక్ష్యం పట్ల చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తన ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ దేశాలన్నీ చేతులు కలిపినట్లు భావిస్తోంది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని, అందుకు విరుద్ధంగా ఉండబోవని ఆశిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో అమెరికా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.