బిహార్ ఎన్నికల్లో సరికొత్త నిబంధనలు

ABN , First Publish Date - 2020-09-25T19:14:25+05:30 IST

రోనా నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో కొత్త నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటనలో

బిహార్ ఎన్నికల్లో సరికొత్త నిబంధనలు

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో కొత్త నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటనలో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ రావత్ షెడ్యూల్ పై మీడియాలో మాట్లాడారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రావత్ ప్రకటించారు.


ఎన్నికల సందర్భంగా లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడగించారు. ఎన్నికల సందర్భంగా 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్స్, 6.7 లక్షల ఫేస్ షీల్డులను, 23 లక్షల హ్యాండ్ గ్లౌజులను వాడుతామని తెలిపారు.


నామినేషన్లు వేసేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లను ఉంచుతామని, ఓటర్లు, అధికారలందరూ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని కరాఖండిగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ గ్లౌజులు ధరించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేస్తామని తెలిపారు.


ఇంటింటికి ప్రచారంలో భాగంగా కేవలం ఐదుగురు కార్యకర్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే నింపాలని, డిపాజిట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా కట్టాలని ఆయన సూచించారు. అయితే నామినేషన్లు వేసే సమయంలో మాత్రం అభ్యర్థితో కేవలం ఇద్దరు మాత్రమే రావాలని, రెండు వాహనాలను మాత్రమే వాడాలని రావత్ స్పష్టం చేశారు.


భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు ఏమాత్రం అనుమతి లేదని తెలిపారు. 80 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అనుమతి ఉంటుందని, మిగితా వారికి ఉండదని అరోరా స్పష్టం చేశారు. పోలింగ్ చివరి సమయంలో కరోనా రోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఈ వ్యవహారం అంతా కూడా ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో సాగుతుందని రావత్ తెలిపారు. 

Updated Date - 2020-09-25T19:14:25+05:30 IST