లాక్‌డౌన్ 4.0 పై నేడు మార్గదర్శకాల విడుదల!

ABN , First Publish Date - 2020-05-17T17:43:59+05:30 IST

గత మూడు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కార్యాలయంలో పలు దఫాలుగా హోంశాఖ సీనియర్ అధికారులతో

లాక్‌డౌన్ 4.0 పై నేడు మార్గదర్శకాల విడుదల!

న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనలపై కేంద్ర హోంశాఖ నేడు మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కార్యాలయంలో పలు దఫాలుగా హోంశాఖ సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండ్రోజులుగా అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా అమిత్‌షా నాలుగోదశ నిబంధనలపై మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.


నాలుగో దశ లాక్‌డౌన్‌కు ప్రజలు సిద్ధంగా ఉండాలని, అయితే ఈ దశ లాక్‌డౌన్ మాత్రం సరికొత్తగా ఉంటుందని ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు కూడా. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ సలహాలు, సూచనలను ఇప్పటికే కేంద్రానికి సూచించారు. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకొని, ఒకచోట క్రోడీకరించి నాలుగో దశ మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.


మూడోదశ లాక్‌డౌన్ ఈ నెల 17 తో ముగిసింది. 18 తేదీ నాటికే నాలుగో దశ లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు దఫాలుగా సీనియర్ అధికారులతో చర్చిస్తూ ఉండటం, ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో మార్గదర్శకాల విడుదలలో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా.... ఆదివారం సాయంత్రానికి కేంద్ర హోంశాఖ నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. 

Updated Date - 2020-05-17T17:43:59+05:30 IST