అధికారులను నిరుత్సాహపర్చేందుకే డిప్యూటేషన్ అస్త్రం.. కేంద్రంపై బెంగాల్ మంత్రి ఫైర్!
ABN , First Publish Date - 2020-12-18T05:29:37+05:30 IST
సెంట్రల్ డిప్యూటేషన్ కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం సమన్లు జారీ చేయడం రాష్ట్ర ఫెడరల్ నిర్మాణంపై దాడి ..

కోల్‌కతా: సెంట్రల్ డిప్యూటేషన్ కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం సమన్లు జారీ చేయడం రాష్ట్ర ఫెడరల్ నిర్మాణంపై దాడి చేయడమేనని పశ్చిమ బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను సైతం పెడచెవిన పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సెంట్రల్ డిప్యూటేషన్ కోసం సమన్లు ఇవ్వడం అధికార దుర్వినియోగమే. ఇలాంటి చర్యలతో కేంద్రం ఐపీఎస్ క్యాడర్ రూల్ 1954లోని అత్యవసర నిబంధనను దుర్వినియోగం చేస్తోంది..’’ అని ముఖర్జీ ఆరోపించారు. ‘‘రాష్ట్ర అధికారాలను ఉద్దేశపూర్వకంగా అణచివేసేందుకు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాధికారులను నిరుత్సాహపరచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఫెడరల్ నిర్మాణంపై దాడి. రాజ్యాంగ విరుద్ధం..’’ అంటూ మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమనీ... ‘‘అప్రజాస్వామిక’’ శక్తుల ముందు తాము మోకరిల్లబోమని ఆయన చెప్పుకొచ్చారు. కాగా సెంట్రల్ డిప్యూటేషన్‌లో చేరేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.