రుణ గ్రహీతలకు ఊరట కలిగించేలా కేంద్రం అఫిడవిట్
ABN , First Publish Date - 2020-10-03T22:17:58+05:30 IST
మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు...

న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం విశేషం. రూ.2కోట్ల వరకు ఉన్న రుణాలపై మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఈ అఫిడవిట్‌తో స్పష్టమైంది. లాక్‌డౌన్‌తో 6 నెలల మారటోరియానికి ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది.
మార్చి నుంచి ఆగస్టు వరకు ఆర్‌బీఐ మారటోరియం విధించింది. ఎంఎస్‌ఎంఈ, విద్య, గృహ వినియోగ వస్తువులపై వడ్డీపై వడ్డీ మినహాయింపుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. వాహన రుణాలు, క్రెడిట్ బకాయిల వడ్డీపై వడ్డీ మినహాస్తున్నట్లు కేంద్రం ధర్మాసనానికి స్పష్టం చేసింది. వడ్డీపై వడ్డీని మినహాయించడమే ఏకైక పరిష్కారమని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొనడం గమనార్హం. రుణాలపై మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చని కేంద్రం తెలిపింది.