కరోనాపై పోరులో భేష్‌!

ABN , First Publish Date - 2020-06-23T08:01:17+05:30 IST

కొవిడ్‌-19పై పోరుకు అద్భుతంగా కృషి చేసిందంటూ కర్ణాటక సర్కారుపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. మిగతా రాష్ట్రాలన్నీ కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలని కూడా కోరింది...

కరోనాపై పోరులో భేష్‌!

  • కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు
  • ధారావిలో కట్టడిపై మహారాష్ట్ర సర్కారుకూ!
  • రెండు చోట్లా విస్తృతంగా ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌

కొవిడ్‌-19పై పోరుకు అద్భుతంగా కృషి చేసిందంటూ కర్ణాటక సర్కారుపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. మిగతా రాష్ట్రాలన్నీ కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలని కూడా కోరింది. అలాగే.. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావిలో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నందుకు మహారాష్ట్ర సర్కారునూ ప్రశంసించింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కర్ణాటక సర్కారు.. అటు ధారావిలో మహారాష్ట్ర సర్కారు ఏం చేశాయి? ఎలా వైర్‌సకు చెక్‌ చెప్పాయంటే.. ధారావి.. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ! కేవలం 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8.5 లక్షలకు పైగా జనాభా ఉండే ప్రాంతం. వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉన్నవారిని ముందుజాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉంచడం, భారీస్థాయిలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం, వైరస్‌ సోకినవారికి ప్రభుత్వమే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించడం వంటి చర్యలతో బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు ఆ ముప్పును సమర్థంగా అడ్డుకున్నారు. ధారావిలో ట్రేసిం గ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ను అద్భుతంగా చేయడమే వైర్‌స కు అడ్డుకట్ట వేయడానికి దోహదం చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ కొనియాడింది. బీఎంసీ సిబ్బం దే పీపీఈ కిట్లు ధరించి మురికివాడలోనిఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. లక్షణాలున్నవారు పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించారు. 


కర్ణాటకలో..

కర్ణాటకలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ వాడకాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో తప్పనిసరి చేశారు. ఈ యాప్‌ కారణంగా రానున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తక్షణ నివారణ చర్యలు చేపట్టడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.   కరోనా అనుమానితులను గుర్తించడం లో అనుసరిస్తున్న విధానం వల్ల కూడా వైరస్‌ నియంత్రణ సాధ్యపడుతోంది.  ఆశా కార్యకర్తలను గ్రామాల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. ఫలితంగా నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లోకి వైరస్‌ వ్యాపించకుండా కట్టడిచేసేందుకు సాధ్యపడింది. 


ఏరోబిక్స్‌.. యోగా..

ధారావిలో ఏర్పాటు చేసిన 300 పడకల క్వారంటైన్‌ కేంద్రంలో.. పాజిటివ్‌ పేషెంట్లకు, లక్షణాలున్నవారితోఏరోబిక్స్‌, యోగా, శ్వాస వ్యాయామాలు చేయించారు. వారు చాలా త్వరగా కోలుకున్నారు. ‘వైరస్‌ సోకినా చాలామందిలో ఏ లక్షణాలూ లేవు. కానీ, కరోనా సోకిందన్న భయం, ఆందోళన, ఒత్తిడి వారిలో ఉండేవి. ఈ కార్యక్రమాలతో ఉపశమనం లభించింది’ అని ప్రైవేటు వైద్యుడు ఒకరు తెలిపారు. మొదట్లో 200 మంది దాకా రోగులుండగా ఆ సంఖ్య 45కు తగ్గిపోయిందన్నారు. వర్షాకాలం కావడంతో కేసులు పెరిగే ముప్పు  ఉంది. అందుకని1,200 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశారు.


-సెంట్రల్‌ డెస్క్‌, బెంగళూరు-ఆంధ్రజ్యోతి


Read more