కేంద్రం పనితీరుపై మాయావతి కామెంట్లు

ABN , First Publish Date - 2020-05-30T23:17:14+05:30 IST

ఎన్డీయే-2 మొదటి సంవత్సరం పాలనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి నిశిత విమర్శలు చేశారు. వలస కార్మికులు...

కేంద్రం పనితీరుపై మాయావతి కామెంట్లు

న్యూఢిల్లీ: ఎన్డీయే-2 మొదటి సంవత్సరం పాలనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి నిశిత విమర్శలు చేశారు. వలస కార్మికులు, పేదలు చాలా ఇబ్బందులు పడ్డారని, వీటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం తమ విధానాలు, పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు.


'130 కోట్ల జనాబాలో ఎక్కువ మంది పేదలు, నిరుద్యోగులు, రైతులు, వలస కార్మికులు, మహిళలు, తదితరులు నిజంగానే ఎన్నో బాధలు పడ్డారు. ఇది చాలా విచారకరం. అంత త్వరగా ఎవరూ దీన్ని మరచిపోలేరు' అని మాయావతి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తమ విధానాలు, పనితీరును ఓపెన్ మైండ్‌తో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తమను తాము సమర్థించుకోవడం కాకుండా తమలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలని ఆమె సూచించారు.


ఎన్డీయే 2.0 పాలన తొలి వార్షికోత్సవం సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ, వాస్తవికతకు అవి అద్దం పట్టడం లేదని అన్నారు. ప్రజల ఆలోచనలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉంటే బీజేపీ రెండో టర్మ్‌లో తొలి ఏడాది పాలన మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ పాలనలో అనేక సందర్భాల్లో వివాదాలు చుట్టుముట్టాయని, దేశం, ప్రజల ప్రయోజనాలను సీరియస్‌గా పట్టించుకోక తప్పదని మాయావతి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-30T23:17:14+05:30 IST