రాష్ట్రాలతో సమన్వయం లేదు, కేంద్రం తప్పు చేస్తోంది : వీరప్ప మొయిలీ

ABN , First Publish Date - 2020-04-05T22:41:56+05:30 IST

కోవిడ్-19పై యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి

రాష్ట్రాలతో సమన్వయం లేదు, కేంద్రం తప్పు చేస్తోంది : వీరప్ప మొయిలీ

న్యూఢిల్లీ : కోవిడ్-19పై యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ తప్పు చేసిందన్నారు. అయోమయాన్ని నివారించేందుకు 21 రోజుల అష్ట దిగ్బంధనం తర్వాత అమలు చేయబోతున్న ప్రణాళిక ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కోవిడ్-19పై పోరాటంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో మొయిలీ, పి. చిదంబరం, జైరామ్ రమేశ్, తమ్రధ్వజ్ సాహు సభ్యులు. 


కోవిడ్-19 పరీక్షలు సార్వజనీనంగా జరగాలని మొయిలీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాటానికి  పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం కీలకమని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పరిమితులకు అతీతంగా ప్రజలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించడంపైనే దృష్టి సారించాయన్నారు. టెస్టింగ్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించే వరకు ఈ మహమ్మారిని నిలువరించగలమని తాను భావించడం లేదన్నారు. 


దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని ప్రకటించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని, సమన్వయంతో వ్యవహరించి ఉండవలసిందన్నారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పిదమని చెప్పారు. ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, ఓ షాక్ తినిపించినట్లు అష్ట దిగ్బంధనాన్ని విధించారని, ముందుగా తెలియజేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఎక్కువ సన్నాహాలు చేసుకుని ఉండేవని అన్నారు.


ఈ విషయంలో చాలా అయోమయం నెలకొందన్నారు. నిజానికి లాక్‌డౌన్‌ను ఆర్థిక, ఆరోగ్య అత్యవసర పరిస్థితులతోపాటు ప్రకటించవలసిందని, అయితే అలా చేయలేదని అన్నారు. బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో దీనిని యుద్ధం వంటి పరిస్థితిగా పరిగణిస్తున్నారన్నారు.


Updated Date - 2020-04-05T22:41:56+05:30 IST