సైన్యానికి స్వేచ్ఛ
ABN , First Publish Date - 2020-06-22T06:56:06+05:30 IST
వాస్తవాధీన రేఖ వద్ద చైనాను దీటుగా ఎదుర్కోవడానికి సైన్యానికి సర్కారు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది. చైనా సైన్యం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సూచించింది...

- హద్దు మీరితే తాట తీయండి
- అవసరమైతే ఆయుధాలూ వాడండి
- పరిస్థితులను బట్టి వ్యవహరించేలా కమాండర్లకే నిర్ణయాధికారం
- రూ.500 కోట్లలోపు కొనుగోళ్లకు త్రివిధ దళాధిపతులకు అధికారాలు
- చైనా నుంచి దిగుమతులపైనా దృష్టి
- వివరాలు తెప్పించుకుంటున్న కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 21: వాస్తవాధీన రేఖ వద్ద చైనాను దీటుగా ఎదుర్కోవడానికి సైన్యానికి సర్కారు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది. చైనా సైన్యం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సూచించింది. చైనా దూకుడు నేపథ్యంలో తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మహాదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులతో సమావేశమై సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వద్దే కాదు.. గగనతలంలో, హిందూ మహాసముద్రంలో కూడా చైనా కదలికలపై, కార్యకలాపాలపై అత్యంత జాగరూకతతో ఉండాలని ఈ భేటీలో ఆయన సూచించినట్టు సమాచారం. సరిహద్దుల వద్ద చైనాకు దీటుగా బదులివ్వడానికి సదా సిద్ధంగా ఉండాలని సూచించిన ఆయన.. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి క్షేత్రస్థాయిలో కమాండర్లకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో తుపాకుల వినియోగానికి, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి ఫీల్డ్ కమాండర్లకు అధికారాలిస్తూ.. పోరాట నియమాలను ప్రభుత్వం మార్చింది. కాగా.. ఇరుదేశాల సైనికులు ఆయుధాలను కలిగి ఉన్నప్పటికీ 1996, 2005 సంవత్సరాల్లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం వాటిని వినియోగించరని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. కాగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవడానికి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో పేర్కొన్నారు.
ఆయుధాలు కొనుక్కోండి..
చైనాతో సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మన త్రివిధ దళాలకు అదనంగా ఆర్థిక బలం చేకూర్చింది. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనడానికి వీలుగా ఒక్కో ప్రాజెక్టుకూ రూ.500 కోట్ల మేర ఖర్చు చేసేందుకు త్రివిధ దళాధిపతులకు ఆర్థిక అధికారాలు కల్పించింది. ఈమేరకు సాయుధ దళాలు.. సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వీలైనంత త్వరలో కొనుగోలు చేయడానికి.. తమకు కావాల్సిన ఆయుధాలు, పరికరాల జాబితాను తయారుచేస్తున్నాయి. మరోవైపు, ఆర్థిక యుద్ధంలో భాగంగా.. చైనా నుంచి మనదేశానికి దిగుమతి అవుతున్న నాణ్యత లేని, చౌకైన వస్తువులపై కేంద్రం దృష్టి సారించింది. ఇక్కడి ధరలతో పోలిస్తే తక్కువగా ఉండే వస్తువుల వివరాలను పంపాల్సిందిగా దేశంలోని పారిశ్రామిక వర్గాలను కోరినట్టు సమాచారం. ప్రధానిమోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఊతమిచ్చే మార్గాలపై ప్రధాని కార్యాలయంలో ఇటీవలే ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. చైనా నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే అంశంపైనా ఇందులో చర్చించారు. 2014-15 నుంచి 2018-19 దాకా దిగుమతుల వివరాలను.. అలా దిగుమతి చేసుకుంటున్న వస్తువుల స్థానిక ధరల వివరాలను, వాటిని స్థానికంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఎంత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద దిగుమతి అవుతున్న వస్తువుల వివరాలు వంటివాటిని అందజేయాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కేంద్రం కోరింది. ఆ వివరాలను సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నామని.. త్వరలోనే వాటిని కేంద్రానికి పంపుతామని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.