కేంద్రం, విపక్షాలు పరిణతి చూపాలి: మాయావతి
ABN , First Publish Date - 2020-06-22T20:54:18+05:30 IST
లడక్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్రం, విపక్షాలు కలిసి పనిచేయాలని, పరిణతి చాటుకోవాలని, సంఘీభావం కలిగి..

న్యూఢిల్లీ: లడక్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్రం, విపక్షాలు కలిసి పనిచేయాలని, పరిణతి చాటుకోవాలని, సంఘీభావం కలిగి ఉండాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హితవు పలికారు. ఈ మేరకు ఆమె సోమవారంనాడు వరుస ట్వీట్లు చేశారు.
'జూన్ 15న చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ స్థాయి అధికారితో సహా 20 మంది భారత సైనికులు మృతి చెందడంపై యావద్దేశం విచారంలో మునిగిపోయింది. ఆందోళనలను కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం, విపక్షాలు పరిణతి ప్రదర్శించాలి. కలిసికట్టుగా సంఘీభావం తెలపాలి. తద్వారా దేశానికి, ప్రపంచానికి సమర్ధవంతమైన సందేశం ఇవ్వగలుగుతాం' అని మాయావతి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'దేశానికి సవాలుగా నిలిచిన ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు ప్రజలు, నిపుణుల అభిప్రాయానికి భిన్నంగా ఉండొచ్చు. ప్రాథమికంగా సరిహద్దులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి వదిలేయడం మంచిది. అది ప్రభుత్వాల బాధ్యత కూడా' అని వరుస ట్వీట్లలో మాయావతి పేర్కొన్నారు.