ఢిల్లీలో శాంతియుత నిరసనకు రైతులకు అనుమతి

ABN , First Publish Date - 2020-11-27T21:55:45+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా

ఢిల్లీలో శాంతియుత నిరసనకు రైతులకు అనుమతి

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఢిల్లీలో నిరసన తెలిపేందుకు రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగమ మైదానంలో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు గురువారం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. 


సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీల ఆధ్వర్యంలో ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం జరుగుతోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తిరిగి వెళ్ళబోమని హెచ్చరించాయి. 


ఢిల్లీ పోలీస్ కమిషనర్ ట్విటర్ వేదికగా శుక్రవారం స్పందిస్తూ, రైతు నేతలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. బురారీలోని నిరంకారీ గ్రౌండ్‌లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా వ్యవహరించాలని రైతులను కోరినట్లు పేర్కొన్నారు. 


దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీలోకి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నిరసన తెలిపేందుకుగల ప్రజాస్వామిక హక్కును రైతులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఆందోళనను పరిష్కరించేందుకు తక్షణమే చర్చలు ప్రారంభించాలని కోరారు. 


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం మాట్లాడుతూ, రైతులతో ఎటువంటి అరమరికలు లేకుండా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డిసెంబరు 3న చర్చలకు రావాలని రైతు సంఘాలను కోరారు. 



Updated Date - 2020-11-27T21:55:45+05:30 IST