చట్టాలను వెనక్కి తీసుకోం... రైతుల అపోహలను తొలగిస్తాం : అమిత్‌షా
ABN , First Publish Date - 2020-12-01T18:19:52+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు. నూతన చట్టాలపై రైతుల్లో

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు. నూతన చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలను, భయాలను దూరం చేస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా పేర్కొన్నారు. అలాగే కనీస మద్దతు ధరపై కూడా రైతులకు భరోసా ఇస్తామని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామని అన్నారు. అయితే నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు. మరోవైపు రైతులతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరపనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో విజ్ఞాన్ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. రైతులు తమ నిరసనను ఉద్ధృతం చేసిన నేపథ్యం, చర్చల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ సమావేశమయ్యారు. రైతులతో చర్చించాల్సిన అంశాలు, చర్చలు ఎలా జరిగితే ఆందోళనను విరమిస్తారన్న అంశాలను వీరు చర్చించినట్లు తెలుస్తోంది.