లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2020-03-24T18:43:39+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి దేశంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పాటిస్తుంటే...

లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి దేశంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పాటిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తమకేమీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.. తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. లాక్‌డౌన్‌‌ను ప్రజలు పాటించకుంటే కర్ఫ్యూను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.


ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు అంతంతమాత్రంగా కనిపించిన లాక్‌డౌన్ ప్రభావం.. మంగళవారం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. రోడ్లపై వెళుతున్న వాహనదారులను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప వెళ్లనివ్వడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో మంగళవారం మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో.. తెలంగాణలో ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది.

Read more