అన్న అని కూడా చూడకుండా.. దారా షికో తలనరికి చిత్రి హింసలు పెట్టి..

ABN , First Publish Date - 2020-02-20T09:19:28+05:30 IST

ఇతిహాసపు చీకటి కోణాల కింద పడి నలిగి కనిపించని కథలూ గాథలూ ఎన్నో..! దేశ కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని మళ్లీ వెలుగుచూస్తుంటాయి. అలాంటి కథనే కేంద్రం ఇపుడు

అన్న అని కూడా చూడకుండా.. దారా షికో తలనరికి చిత్రి హింసలు పెట్టి..

నడుస్తున్న చరిత్రకు  మొఘల్ పరిమళం!

దారా షికో చరిత్రను తవ్వుతున్న కేంద్రం..

సమాధి అన్వేషణకు ఏడుగురు చరిత్రకారులతో కమిటీ

షాజహాన్‌ వారసుడు .. ఔరంగజేబు అన్న

గద్దె కోసం అన్నను కడతేర్చిన ఔరంగజేబు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:  ఇతిహాసపు చీకటి కోణాల కింద పడి నలిగి కనిపించని కథలూ గాథలూ ఎన్నో..! దేశ కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని మళ్లీ వెలుగుచూస్తుంటాయి. అలాంటి కథనే కేంద్రం ఇపుడు తవ్వితీయాలని నిర్ణయించడం ఆసక్తిని రేపుతోంది. 360 సంవత్సరాల కిందట నిహతుడైన ఓ మొఘల్‌ సామ్రాజ్య వారసుడి గాధని ఇప్పటితరానికి అందించే ప్రయత్నం చేస్తోంది. మొఘల్‌ సామ్రాజ్య వారసుడి పేరు ‘దారా షికో’ (లేదా దారా షుకో).. ఈయన షాజహాన్‌కు పెద్ద కొడుకు. ఔరంగజేబుకు అన్న. తండ్రి తరువాత చక్రవర్తి కావలసినవాడు. కానీ కాలేక 1659లో తమ్ముడి చేతిలో హతుడయ్యాడు. అతనిని ఢిల్లీలోని హుమయూన్‌ టూంబ్స్‌లో సమాధి చేశారు. కేంద్రం తాజాగా అతని సమాధి ఎక్కడుందో అన్వేషించి తెలియజెప్పాలని ఏడుగురు ప్రసిద్ధ చరిత్రకారులతో ఓ కమిటీని వేసింది.  పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌ టీజే అలోన్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో ఆర్‌ ఎస్‌ బిష్త్‌, సయీద్‌ జమాల్‌ హసన్‌, బీ ఆర్‌ మణి, కేఎన్‌ దీక్షిత్‌, సతీశ్‌ చంద్ర లాంటి ప్రముఖులున్నారు. హుమయూన్‌ టూంబ్స్‌లో మొత్తం 140 గోరీలున్నాయి. అందులో ఎక్కడ దారా సికో సమాధి ఉందో తెలియదు.


పశ్చిమాన ఉన్న చిన్న సమాధి అతనిదేనని ఆనాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయిన ఇటాలియన్‌ యాత్రికుడు మానుషి రాసిన విషయాలే అందరికీ ప్రామాణికం. ‘‘చరిత్రకారులు దీనిని పరిశోధించి 3నెలల్లోగా నివేదిక ఇవ్వాలి. పురావస్తు సాక్ష్యాధారాలు, చారిత్రక సత్యాలు, పుస్తకాలు, ఇతర వివరాలను ఉపయోగించి వారు ఓ నిర్ధారణకు రావాలి’’ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ చెప్పారు. 


దారా విషాదాంతం

1657 సెప్టెంబరులో షాజహాన్‌ ఆరోగ్యం క్షీణించినపుడు వారసుల మధ్య యుద్ధం చెలరేగింది. 1658లో ఆగ్రా సమీపంలోని సముగఢ్‌ యుద్ధంలో ఔరంగజేబు సైన్యం దారా సేనను ఓడించింది. ఔరంగజేబు తన అన్నను చిత్ర హింసలు పెట్టిన తరువాత క్రూరంగా హత్యచేశాడు. అన్న తల నరికి తెచ్చి- తాను కూడా కత్తితో మూడుసార్లు పొడిచి- ఆ నరికిన తలను ఓ పెట్టెలో పెట్టి-  ఆగ్రా కోటలో చెరసాలలో ఉంచిన తండ్రి షాజహాన్‌కు బహుమతిగా పంపినట్లు చరిత్ర చెబుతోంది.  


ఇపుడెందుకు వెలికి తీయడం?

దారా షికో మితవాద ముస్లిం. హైందవం-ఇస్లామిక్‌ సంప్రదాయాల మధ్య సారూప్యతను ఆనాడే విశ్లేషించగలిగాడు. మూడు శతాబ్దాల కిందటే భారత్‌లో అంత గొప్పగా ఆలోచించగలిగిన మేధావి మరొకరు లేరనేది చరిత్రకారుల విశ్వాసం. ఉపనిషత్తుల గొప్పదనాన్ని ఎరిగి పర్షియన్‌లోకి తర్జుమా చేయడం ఎందరినో ప్రభావితం చేసింది. ఈ మధ్య జరిగిన ఓ సదస్సులో కొందరు ఆరెస్సెస్‌ నేతలు దారాను ‘సిసలైన హిందూస్థానీ’ అని అభివర్ణించారు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో దారా షికో పేరిట ఓ పరిశోధన విభాగం నిరుడు ఏర్పాటైంది. భారత్‌లో నిజమైన ముస్లిం అంటే భారతీయ సంస్కృతిని అర్థఽం చేసుకుని, హైందవంతో కలిసిమెలిసి జీవించడమేనని తెలియజెప్పేందుకే మోదీ ప్రభుత్వం దారా షికోను హైలైట్‌ చేయాలనుకొంటోందని ఓ వాదన వినిపిస్తోంది. 


దారా షికో గొప్పదనమేంటి?

షాజహాన్‌ కుమారుల్లో పెద్దవాడైన దారా... 1615 మార్చి 11న పుట్టాడు. మొఘల్‌ సామ్రాజ్యంలో ఉదారవాదిగా పేరు. 13 మంది అన్నదమ్ములు-అక్క చెల్లెళ్లు ఉన్న దారాకు యుక్త వయసు వచ్చే సరికి మిగిలినది ఆరుగురే. వారిలో ఔరంగజేబు ఒకరు. ఔరంగజేబు మాదిరిగా దారాలో ఛాందసభావాలు లేవు. ముత్తాత అక్బర్‌ మాదిరిగా అన్ని మతాలను సమరీతిన గౌరవించే సంస్కారవంతుడిగా పేరుంది. ముఖ్యంగా హిందూమతంపై గౌరవం ఉన్న వ్యక్తి. దారా అద్భుతమైన కవి. ఈ సాంస్కృతిక తృష్ణే ఔరంగజేబు కన్నెర్రకు కారణమైంది. తన వారసుడిగా దారాను చాలా ఏళ్ల ముందుగానే షాజహాన్‌ ప్రకటించాడు.  ఎంత గొప్ప కవో అంత కంటే పెద్ద యుద్ధవీరుడు కూడా!  

Updated Date - 2020-02-20T09:19:28+05:30 IST