బొగ్గు కుంభకోణం కేసు: మాజీ కేంద్రమంత్రికి జీవిత ఖైదు విధించాలన్న సీబీఐ

ABN , First Publish Date - 2020-10-14T20:06:21+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్‌కి జీవిత ఖైదు విధించాలని...

బొగ్గు కుంభకోణం కేసు: మాజీ కేంద్రమంత్రికి జీవిత ఖైదు విధించాలన్న సీబీఐ

న్యూఢిల్లీ: 1999 బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్‌కి జీవిత ఖైదు విధించాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సీబీఐ అభ్యర్థించింది. సాక్షులు, సీబీఐ వాదనలను విన్న అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తన తీర్పును ఈ నెల 26కి వాయిదా వేశారు.  జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ సుదీర్ఘ విచారణ జరుపుతోంది. ఈ కేసులో నాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల సహాయమంత్రిగా పనిచేసిన రాయ్‌తో పాటు బొగ్గు శాఖ ఉన్నతాధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా తదితరులను ఇటీవల ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా గుర్తించింది.  రాయ్‌తో పాటు దోషులుగా తేలిన వారందరికీ జీవిత ఖైదు విధించాలని సీబీఐ కోరింది. ఇవాళ నిందితులకు శిక్షలు ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేక న్యాయమూర్తి తన తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.

Updated Date - 2020-10-14T20:06:21+05:30 IST